ఆ లోటు తీర్చేసిన శ్రీనివాస్‌… మార్గదర్శిపై మరో కేసు!

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నిరాధార ఆరోపణలతో సీఐడీ కేసులు నమోదు చేసి వేధిస్తుందని.. జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు ఒడిగట్టిందని.. అసలు మార్గదర్శిపై ఇప్పటివరకూ ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అని ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే అని ఇన్ని రోజులు మార్గదర్శి వాదించేది! అయితే ఇప్పుడు ఆలోటు తీరిపోయిందని తెలుస్తుంది.

అవును… తాజాగా ముష్టి శ్రీనివాస్ అనే బాధితుడు మార్గదర్శి బండారం మొత్తం బయటపెట్టినంత పనిచేశాడని అంటున్నారు. ఇందులో భాగంగా మీడియా ముందు మార్గదర్శిలో తనకు జరిగిన అన్యాయం గురించి సవివరంగా వివరించాడు. స్పష్టమైన ఆధారలు సమర్పించాడని తెలుస్తుంది.

ముష్టి శ్రీనివాస్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్ పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్ పాడుకున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని, కనీసం తాను జమ చేసి మొత్తం కూడా తిరిగి ఇవ్వనంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్. దీంతో ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పని మొదలుపెట్టారని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే… విజయవాడకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్, న్యాయవాది శ్రీనివాస్.. లబ్బీపేటలోని మార్గదర్శి సంస్థలో 50లక్షల చిట్ గ్రూప్ లో 2021 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాడట. చిట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటిని ష్యూరిటీగా చూపించాడట. ఈ క్రమంలో… చిట్ పాడుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడం లేదంట.

తాను పాడుకున్న చిట్ డబ్బులు ఇవ్వాలంటే షూరిటీ చూపించాలన్నారట సిబ్బంది. చిట్ లో చేరేటప్పుడే ఇంటిని షూరిటీ పెట్టాను కదా అనే విషయాన్ని గుర్తు చేసినా… ఇప్పుడు అది సరిపోదని అడ్డం తిరిగారట. దీంతో ఇలా వేదిస్తూ.. చిట్ డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు శ్రీనివాస్.

ఇదే సమయంలో చిట్ గ్రూప్ లో సభ్యులు పూర్తిగా లేకపోయినా వాటిని నిర్వహిస్తున్నారంటూ గతంలోనే మార్గదర్శిపై ఫిర్యాదు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి.. శ్రీనివాస్ కేసులో కూడా ఆ విషయం బయటపడిందని అంటున్నారు. 50మంది ఉండాల్సిన చిట్ గ్రూప్ లో 30మందే ఉన్నారట. ఇదే సమయంలో ఈ చిట్ కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సిన బ్యాంకు ఖాతా కూడా లేదని తెలుస్తుంది.

అనంతరం మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పై ముష్టి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా తెలిపారు. నేరపూరిత విశ్వాసఘాతుకం (ఐపీసీ 409), మోసం (ఐపీసీ 420), నేరపూరిత కుట్ర (ఐపీసీ 120బీ)తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ (5) కింద ఈ కేసు పెట్టామన్నారు.

ఇందులో భాగంగా… ముష్టి శ్రీనివాస్‌ చిట్టీ పాడుకున్నా.. మార్గదర్శి సంస్థ అతనికి డబ్బులు చెల్లించట్లేదన్న ఫిర్యాదుపై లబ్బీపేట బ్రాంచి మేనేజర్‌ బి.శ్రీనివాసరావు, ఆ బ్రాంచిలో పనిచేసే సిబ్బంది, మార్గదర్శి చిట్‌ ఫండ్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.