సెన్సేషనల్ న్యూస్: విశాఖలో మరో బెదిరింపు లేఖ పంపిన మావోలు

విశాఖ ఏజెన్సీలో మరో లేఖను విడుదల చేశారు మావోలు. మావోయిస్టు గాలికొండ కమిటీ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. విశాఖ ఏజెన్సీలో ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యల అనంతరం పలువురు నేతలకు బెదిరింపు లేఖలు పంపారు మావోలు. ఇప్పుడు ఏపిఎఫ్‌డిసి కి వ్యతిరేకంగా మరో లేఖను విడుదల చేశారు మావోలు. స్థానికంగానూ, పోలీసు శాఖలోనూ ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

గతంలో పలువురు అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ బెదిరింపు లేఖలు పంపారు మావోలు. ప్రజాప్రతినిధులు అధికార పార్టీ ప్రలోభాలకు లోబడి ఏజెన్సీలో అక్రమాలకు పాల్పడుతున్నారని, మానుకోకపోతే కిడారి, సోములకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, చౌడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ రాజులకు అక్రమ మైనింగ్ లో ప్రమేయం ఉందని వెల్లడించారు. గిరిజనులలో పుట్టి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారిలు మైనింగ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు బినామీల పేరుతో మైనింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ లేఖలు రాశారు.

ఇప్పుడు ఏపిఎఫ్‌డిసి కి వ్యతిరేకంగా రాసిన లేఖలో చట్ట ప్రకారం కాఫీ తోటలపై హక్కు ఆదీవాసీలదే, పీడిత ప్రజలదే అన్నారు. కాఫీ తోటలకు అడ్డుపడుతూ ఆదివాసులను, కాందిసేకులను శ్రమదోపిడి చేస్తున్న ఏపిఎఫ్‌డిసి యాజమాన్యాన్ని మన్యం నుండి తరిమి కొట్టండి. ఏపిఎఫ్‌డిసి ఖబడ్ధార్. బాక్సయిట్ తవ్వకాలను చేపడుతున్న ఆదివాసీ జీవితాలను నాశనం చేయాలనీ చూస్తున్న అధికార టీడీపీ, బీజేపీ నాయకులను మన్యం నుండి తరిమి కొట్టండి. అంటూ సిపిఐ(మావోయిస్టు) గాలికొండ ఏరియా కమిటీ పేరిట లేఖ వచ్చింది. దీనికి సంబంధించిన లేఖలు కింద ఉన్నాయి చూడండి.