విశాఖపట్నం జిల్లా అరకులోయ ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరర్రావు మావోయిస్టు కాల్పుల్లో మరణించారు. ఎంఎల్ఏ కిడారిపై మావోయిస్టుల నుండి ఎప్పటి నుండో వార్నింగులు వస్తున్నాయి. చంపేస్తామంటూ తీవ్రంగా హెచ్చరికలు వస్తునే ఉన్నాయి. నియోజకవర్గంలోని డింబ్రిగూడ మండలంలోని లిపిటిపుట్ట వద్ద ఉదయం ఎంఎల్ఏని లక్ష్యం చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరిపారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పుల్లో మాజీ ఎంఎల్ఏ సిబేరి సోమతో పాటు మరో వ్యక్తి కూడా బుల్లెట్ గయాలయ్యాయి. కిడారి ప్రమాధ ఘటనలోనే మరణించగా సోమ తర్వాత మృతి చెందారు.
2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన కిడారి తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. కిడారి వ్యవహారం నచ్చకపోవటంతో మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. అయినా కిడారి తన వైఖరిని మార్చుకోలేదని సమాచారం. దాంతో ఈరోజు కిడారిపై దాదాపు 50 మంది మావోయిస్టులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హాఠాత్తుగా దాడి చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రధానంగా బాక్సైట్ తవ్వకాలపైనే వివాదాలు నడుస్తున్నాయి. అటువంటిది మైనింగ్ యాక్టివిటీల్లో ఎంఎల్ఏ పరోక్షంగా మద్దతుగా నిలబడ్డారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కిడారి టిడిపి విప్ గా ఉన్నారు.
ఎంఎల్ఏల కదలికలపై కొంతకాలంగా మావోయిస్టులు గమనిస్తున్నట్లు సమాచారం. దానికితోడు అంతా తమ ప్రాంతమే కాబట్టి ఎంఎల్ఏ కూడా సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోలేదంటున్నారు. మావోయిస్టుల నుండి లైఫ్ త్రెట్ ఉన్నా పెద్దగా లెక్క చేయలేదనే అంటున్నారు. అందువల్లే ఇంతటి దారుణం జరిగింది. ఓ మైనింగ్ ప్రాంతానికి వాహనంలో వెళుతున్న ఎంఎల్ఏ వాహనాన్ని మావోయిస్టులు నిలిపేశారు. వాహనంలో నుండి బయటకు దిగిన తర్వాత ఎంఎల్ఏని నిర్ధారించుకుని చాతిపై తుపాకి పెట్టి మరీ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో ప్రమాధ ఘటనలోనే ఎంఎల్ఏ మరణించారు.