రాజకీయంగా శ్రీకాకుళం అంటే ముందుగా గుర్తొచ్చేది కింజారపు ఫ్యామిలీ. ఎర్రన్నాయుడు వేసిన రాజకీయ బీజాలను అనుకుని ఆ కుటుంబం చక్రం తిప్పుతోంది. మొదటి నుండి ఈ ఫ్యామిలీ టీడీపీలోనే ఉంటూ వస్తోంది. మధ్యలో ఎర్రనాయుడు పార్టీ మారినా చివరికి టీడీపీలోకి చేరుకొని స్థిరపడిపోయారు. ప్రజెంట్ పార్టీలో ఆయన సోదరుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీలోని కీలకమైన లీడర్లలో ఈయన కూడ ఒకరు. అలాగే ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ఇలా ఇద్దరు బలమైన నేతలు ఆ కుటుంబం నుండి టీడీపీ తరపున రాజకీయం చేస్తున్నారు. అసలు కింజారపు ఫ్యామిలీ అంటే టీడీపీ అనే ట్రేడ్ మార్క్ ముద్ర పడిపోయింది.
అలాంటి పసుపు కుటుంబంలో కూడ కిందిస్థాయిలో చీలికలున్నాయి. ఆ కుటుంబానికి చెందిన కొందరు వైసీపీ తరపున రాజకీయం చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు చిన్నా చితకా రాజకీయంగా ఉన్న ఇది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. అచ్చెన్నాయుడుకు వరుసకు సోదరుడి కుమారుడైన కింజారపు అప్పన్న వైసీపీ తరపున సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నారు. అయితే తాను అధ్యక్షుడి హోదాలో, ఎమ్మెల్యేగా ఉండగా సర్పంచ్ పదవి వేరొకరికి వెళితే పరువు దక్కదని అనుకున్నారో ఏమో కానీ అచ్చెన్నాయుడు నామినేషన్ వేయవద్దని అప్పన్నను నిలువరించాలని అనుకున్నారట. కానీ అప్పన్న ఆగలేదు.
ఆయన నామినేషన్ వేసే సమయానికి అక్కడికి అచ్చెన్నాయుడు బలపరుస్తున్న అభ్యర్థి తండ్రి కూడ చేరుకున్నారు. ఇక్కడ అచ్చెన్నాయుడు గెలిపించాలని అనుకున్నది వేరెవరినో కాదు తన సోదరుడు హరిప్రసాద్ కుమారుడైన సురేష్ ను. వీరు టీడీపీలోనే కొనసాగుతున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో ఇరువర్గాల నడుమ గొడవ జరిగింది. అధికార పార్టీ ఏమో అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడననే కూడ లేకుండా అప్పన్న మీద దాడికి తెగబడ్డారని, ఇది ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని అన్నారు. ఈ తంతు మొత్తం చూస్తే అచ్చెన్న కుంటుంబంలోనే రాజకీయంగా ఇన్ని విబేధాలు, గొడవలు ఉన్నాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక వైసీపీ సైతం అచ్చెన్నాయుడు కుటుంబంలోనే రాజకీయ వ్యతిరేకులు ఉండటంతో వారికి పూర్తి సహకారం అందిస్తోంది. ఎంపీ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లి అప్పన్నను పరామర్శించనున్నారు. చూడబోతే రానున్న రోజుల్లో సొంత కుటుంబ సభ్యులే అచ్చెన్నాయుడుకు రాజకీయ ప్రత్యర్థులు అయ్యేలా ఉన్నారు.