లాస్ట్ మినిట్ ట్విస్ట్:‘లక్ష్మీస్ ఎన్టీఆర్’విడుదలపై స్టే

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.సినిమాలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్న ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని తెలుదుదేశం పార్టీ కు చెందిన నాయకులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని నిలిపివేయాలంటూ.. ఆ సినిమా విడుదల కారణంగా తమ మనోభావాలు దెబ్బతింటాయంటూ మంగళగిరి కోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిటీషన్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది.అంతేకాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్టే ఇచ్చింది.

ఈ సినిమా విడుదల అయితే తమ మనోభావాలు దెబ్బతింటాయని.. కాబట్టి ఏప్రిల్‌ 15 వరకు సినిమా విడుదలను ఆపేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా దర్శకుడు రాంగోపాల్‌వర్మ, అగస్త్య మంజు, రాకేష్‌రెడ్డి, దీప్తి, బాలగిరి, నరేంద్రచారి, జీవీఆర్‌, జీవీ ఫిల్మ్స్‌ ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు, టీవీ చానెళ్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్లను సైతం నిషేధించాలని కోర్టును పిటీషనర్ తరుపు లాయర్ కోరారు. అయితే మంగళగిరి ఇచ్చిన స్టేపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది..

మరో ప్రక్క నిర్మాత మాట్లాడుతూ..‘‘ సినిమాలో తెలుగుదేశం పార్టీ జెండాను, గుర్తును ఎక్కడా చూపలేదు. టీడీపీ జెండాలోని కలర్‌ను మాత్రమే వాడాం. ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగాన్ని సినిమాలో చూపించాం. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగానే సినిమా తీశాం. ఆనాడు జరిగిన సంఘటనలను మాత్రమే సినిమాలో చూపించాం.’’ అని రాకేశ్‌రెడ్డి తెలిపారు.