పవన్ కు మరో షాక్… తూ.గో. నేతల వరుస రాజీనామాలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా టీడీపీతో పొత్తు ప్రకటించిన అనంతరం జనసేన నేతల్లో ఆత్మాభిమానం, సీట్ల సర్ధుబాటు మొదలైన సమస్యలు వచ్చిపడుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఒంటెద్దు పోకడ్దలు పెరిగిపోయాయని, అంతర్గత ప్రజాస్వామ్యం అనే ఊసే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కు వరుసగా షాక్ లు ఇస్తున్నారు జనసేన నేతలు!

అవును… టీడీపీతో పొత్తు ప్రకటన అనేది పవన్ కల్యాన్ పూర్తి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని, పక్కన ఆయన మేనేజర్ నాదెండ్ల మనోహర్ కోరుకున్నది కూడా ఇదే అని, ఇంతోటి దానికి తామంతా జనసేన కోసం ఎందుకు కష్టపడాలి అంటూ కాస్త ఆత్మాభిమానం కలిగిన జనసేన నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా తాజాగా పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసారు. పవన్ కల్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పు గోదావరి జిల్లాలో ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. జనసేనలో సీనియర్‌ నేతగా ఉన్న ఆమె.. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆమె పార్టీ లోనే కొనసాగుతూ.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ వస్తున్నారు.

ఈ సమయంలో ఆమె పార్టీ అధినేతకు ఒక లేఖ రాశారు. “గత ఐదున్నర సంవత్సరాలుగా మీ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. ఈ రోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ… మాకినీడి శేషు కుమారి” అని సింపుల్గా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారు! అయితే… ఈమె ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు లేఖలో వెల్లడించనప్పటికీ… పవన్ కల్యాణ్ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలే కారణం అని తెలుస్తుంది.

కాగా… గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. తన పార్టీలో ఉన్న వారికి కూడా అవి ఉంటాయన్న విషయం తెలుకోలేకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో… తన బలం, బలంగం అక్కడే ఉందంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. అందులో భాగంగానే తన సొంతజిల్లా పశ్చిమగోదావరి నరసాపురం నియోజకవర్గం నుంచి కాకుండా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్రను ప్రారంభించారని.. అయితే టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం అనూహ్యంగా అక్కడినుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని అంటున్నారు పరిశీలకులు.