మన రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఏ పని చేసినా ముహుర్తాలు, శకునాలు, వాస్తులు చూసుకుని చేస్తుంటారు. ఇలాంటి నమ్మకాలు కొంతవరకు బాగానే ఉంటాయి కానీ మితిమీరితేనే ఆశ్చర్యంగా కనిపిస్తుంటాయి. అన్నీ ప్లాం ప్రకారమే చేసి ఒక్కోసారి పరాజయాలు ఎదురైతే వాటికి కూడ ఇలాంటి సెంటిమెంట్లు ఆపాదిస్తుంటారు కొందరు నేతలు. సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఎవ్వరూ ఊహించని ఓటమి. అసలు తెలుగుదేశం పార్టీకి అంత అద్వానపు పరిస్థితి వస్తుందని కూడ ఎవ్వరూ అనుకోలేదు.
కానీ వచ్చేసింది. తీరా తేరుకుని ఈ స్థాయి ఓటమి వచ్చిందంటే ఎన్ని పొరపాట్లు, ఎన్ని తప్పిదాలు జరిగి ఉంటాయోనని సమీక్షించుకున్నారు. ఆ సమీక్షల్లో గత ఐదేళ్ల పాలన, కలల రాజధాని పేరుతో కాలయాపన, ఎన్నికల్లో పార్టీని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం, టికెట్ల కేటాయింపులో పొరపాటు నిర్ణయాలు, స్థానికంగా ఎమ్మెల్యేలు చేసిన అనేక ఘనకార్యాలు అన్నీ బయటపడ్డాయి. ఎవరైనా అయితే ఈ తప్పులను విశ్లేషించుకుని ముందు ముందు అలాంటివి రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ టీడీపీలో మాత్రం వాస్తు దోషం వలెనే పార్టీ ఘోరంగా ఓడిందనే చర్చ నడుస్తోందట.
గాజువాకలో టీడీపీకి బ్రహ్మాండమైన పార్టీ ఆఫిస్ ఉంది. కార్పొరేట్ ఆఫీసుల లెవల్లో అన్ని సదుపాయాలు అందులో ఉన్నాయి. కానీ అక్కడ భయంకరమైన వాస్తు దోషం ఉందని టాక్. ఈమధ్యే బాబుగారు పార్లమెంటరీ అధ్యక్షులను నియమించారు. ఆ నియామకాల్లో గాజువాకకు విశాఖ పార్లమెంట్ అధ్యక్ష పదవిని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు ఇచ్చారు. మామూలుగా అయితే ఆయన గాజువాక పార్టీ ఆఫీస్ నుండి పార్లమెంటరీ అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అక్కడ వాస్తు దోషం ఉందని క్యామ్ప్ కార్యాలయానికే పరిమితమయ్యారట ఆయన.
ఆ వాస్తు దోషం మూలంగానే గతంలో అధ్యక్ష పదవిలో కూర్చున్న ఎస్.ఏ రెహమాన్, వాసుపల్లి గణేష్ ఇద్దరూ పార్టీని విడిచి వైసీపీ గూటికి వెళ్లారని, అందుకే ఆ కార్యాలయానికి తాను వెళ్లనని, అసలు ఆ వాస్తు దోషం మూలంగానే పార్టీకి ఈ పరిస్థితి అనుమానం కూడ ఉందని పల్లా శ్రీనివాస్ అంటున్నారట. ఎప్పుడైతే మరమ్మత్తులు చేసి వాస్తును సరిచేస్తారో అప్పుడే పార్టీ ఆఫీసులో అడుగుపెడతానని అంతవరకూ క్యాంపు కార్యాలయం నుండే పనిచేస్తానని శ్రేణులకు తెలిపారట.