తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ హాయాంలో టీడీపీలోకి ప్రవేశించిన పరిటాల రవి అనతి కాలంలోనే ఎదురులేని శక్తిగా ఎదిగారు. అనంతపురం జిల్లాలో పూర్తి పట్టు సాధించి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ఆయన మరణానంతరం అయన కుటుంబానికి టీడీపీలో సముచిత స్థానం ఇచ్చారు బాబు. రవి సతీమణి సునీతను టికెట్ ఇచ్చారు. సునీత ఎమ్మెల్యేగా గెలుపొందాక మంత్రి పదవిని కూడ ఇచ్చారు. ఇలా రెండు పర్యాయాలు రాప్తాడు నుండి సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పరిటాల రవి వారసుడిగా కుమారుడు శ్రీరాంను రంగంలోకి దింపాలని భావించిన సునీత పెద్ద గ్రౌండ్ వర్క్ చేశారు.
గత ఎన్నికల్లో రాప్తాడు నుండి తాను తప్పుకుని ఆ టికెట్ కుమారుడికి ఇప్పించుకున్నారు. రవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు అందరూ. సునీత సైతం చేయాల్సిన ప్రిపరేషన్ మొత్తం చేసేశాం కాబట్టి గెలుపు తథ్యమని భావించారు. పరిటాల శ్రీరామ్ సైతం రవి కుమారుడిగా తనను జనం నెత్తిన పెట్టుకుంటారని ఆశించారు. కానీ ఎన్నికల్లో అన్నీ తారుమారయ్యాయి. 25 వేల ఓట్ల తేడాతో శ్రీరామ్ ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి, గతంలో రెండు పర్యాయాలు సునీత చేతిలో ఒడిపోయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. శ్రీరామ్ ఓటమి అనంతరపురంలోనే కాదు మొత్తం రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ అయింది. పరిటాల రవి కుమారుడేంటి, ఓడిపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.
తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిటాల వర్గీయులు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే శ్రీరామ్ మీద వైసీపీ గురిపెట్టింది. ఆయన్ను టార్గెట్ చేసుకుని జనంలో ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించారు. యువకుడైన శ్రీరామ్ చాలా దూకుడుగా ఉన్నాడని, అతని శైలి చూస్తే ఆదోళనకరంగా ఉందని ప్రచారం చేశారు. వాహనాల్లో ఆయుధాలున్నాయనే ఆరోపణలు, కిడ్నాప్ అభియోగాలు ఉన్నాయి. తోపుదుర్తి అనుచరుడి కిడ్నాప్ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ అభియోగాలే శ్రీరామ్ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ఓటర్ల ఆలోచనాధోరణి కూడ మారడం మూలాన గతంలో మాదిరిగా పరిటాల పేరుకు ఓట్లు రాలేదని, ప్రకాష్ రెడ్డి నెమ్మదితనం వారిని ఆకర్షించిందని చెబుతున్నారు.