మహాకూటమి లెక్కలు ఖరారు, కోదండరాం తక్కువ సీట్లతో సరి

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మహాకూటమి సీట్ల పంపకాలపై శనివారం ఢిల్లీలో శరవేగంగా పరిణామాలు జరిగాయి. చంద్రబాబు, టిపిసిసి చీఫ్ ఉత్తమ్, ఎల్ రమణ శనివారం రాత్రి 10 గంటల నుంచి దాదాపు గంటపాటు చర్చించి సీట్ల వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. మహాకూటమి పై కూడా నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

తెలంగాణ జనసమితి నేతలు ముందు నుంచి కూడా 15, 10 సీట్లకు తగ్గేది లేదని తేల్చిచెప్పుకుంటూ వచ్చినా చివరికి వారు 8 సీట్లకు సర్దిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతా కలసి గెలుపు కోసం కృషి చేయాలి కానీ ఆర్బాటానికి పోయి గెలవని దగ్గర కూడా పోటి చేసి ఇబ్బంది పడవద్దని నేతలు చర్చించుకున్నారు.  ఎవరెవరు ఏ  ఏ స్థానాల్లో పోటి చేయాలనే అంశం పై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే సీట్ల పంపకాలు మాత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే 

కాంగ్రెస్- 91

టిడిపి- 15

తెలంగాణ జన సమితి- 8

సిపిఐ- 5

గెలిచే సీట్లలోనే పోటి చేయాలని ఆర్బాటానికి పోయి భంగ పడవద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. 2009లో టిఆర్ ఎస్ మహాకూటమిలో పట్టుబట్టి 46 సీట్లు తీసుకొని పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేదని చంద్రబాబు ఈ సంధర్బంగా గుర్తు చేశారు. 

కొన్ని సీట్లను అన్ని పార్టీలు కావాలని కోరుకోవడంతోనే అసలు సమస్య వస్తుందని తెలుస్తోంది. ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో 2009, 2014లో కాంగ్రెస్, టిడిపిలు చెరోసారి గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గాలను రెండు పార్టీలు కూడా కోరుతున్నాయి. వీటి పైనే ప్రధానంగా ప్రతిష్టంభణ ఏర్పడే అవకాశం ఉంది. సీపిఐ కూడా కాంగ్రెస్, తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో సీట్లు అడుగుతుంది. పార్టీ అభ్యర్ధికి ఉన్న బలం ఆధారంగా అటువంటి ప్రాంతాలలో సీట్లు కేటాయించుకోవాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.  

సీట్ల పంపకానికి ముందు హైదరాబాద్ లో చాలా పెద్ద చర్చలే నడిచాయి. శుక్రవారం రాత్రి టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఉత్తమ్ సమావేశమై సీట్ల పంపకాల పై ఒక అభిప్రాయానికి వచ్చారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీట్ల విషయంలో అంతా సమన్వయంగా పని చేయాలని గెలిచే స్థానాలు తీసుకోవాలని గెలవని స్థానాల కోసం ఆరాటపడి కూటమి పరువు పోగొట్టుకోవద్దని చర్చించినట్టు తెలుస్తోంది. టిజెఎస్ నేతలు కూడా 8 సీట్లకు ఒప్పుకోవడంతో సీట్ల లొల్లి పరిష్కారమైంది. ఆ తర్వాత రమణ, ఉత్తమ్ లిద్దరూ ఢిల్లికి చేరుకున్నారు.

చంద్రబాబుతో సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, రాజా, నారాయణ సమావేశమయ్యారు. అంతా కలిసి శనివారం రాత్రి డిన్నర్ చేశారు. ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల గురించి వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో కూడా సీట్ల పంపకాన్ని తొందరగా ముగించి ప్రచారాన్ని ముమ్మురం చేయాలని సిపిఐ నేతలు చంద్రబాబుకు సూచించారు.

కొత్తగా రాష్ట్రీయ లోక్ దళ్ కూడా కూటమిలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. వారు కూడా 2 సీట్లను కోరుతున్నారని చర్చ జరుగుతోంది. ఆర్డీఎల్ ను కూటమిలో చేర్చుకోవడం ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తుకు అనుకూలంగా ఉండటంతో పాటు బలం చేకూరుతుందనే యోచనలో నేతలున్నారు. ఆర్డీఎల్ కు సీట్లిస్తే కాంగ్రెస్, టిడిపి చెరో స్థానాన్ని త్యాగం చేయక తప్పదని నేతలు భావిస్తున్నారు.  

ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన డిఎస్ చంద్రబాబును కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. వంటేరు ప్రతాప్ రెడ్డి, బండ్ల గణేష్ లు కూడా చంద్రబాబును కలిశారు. రాజేంద్రనగర్ నుంచి తాను కాంగ్రెస్ తరపున పోటి చేస్తున్నానని కూటమిలో ఆ సీటుకు టిడిపి నుంచి పోటి లేకుండా చూడాలని బండ్ల గణేష్ చంద్రబాబును కోరారు.

తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలు ఢిల్లిలో వేగంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీటెక్కిందని పలువురు చర్చించుకున్నారు. ఢిల్లిలో వేసిన నేతల మంత్రాంగం ఎంత వరకు పనిచేస్తుందో వేచి చూడాలి.