పోటీపై క్లారిటీ ఇచ్చిన మాగుంట

మొత్తానికి తన రాజకీయ కార్యాచరణపై ఒంగోలు మాజీ ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాను తెలుగుదేశంపార్టీ తరపున ఒంగోలు లోక్ సభ కు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. మాగుంటను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున ఎంపిగా పోటీ చేయమని చంద్రబాబు ఒత్తిడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న మాగుంటకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. అందుకనే ఆయన తొందరలోనే టిడిపికి రాజీనామా చేసేస్తారంటూ పార్టీలో కూడా ప్రచారం జరుగుతోంది.

నిజానికి మాగుంటకు వచ్చే ఎన్నికల్లో ఎంపిగా అందులోను టిడిపి తరపున పోటీ చేయటం ఇష్టం లేదట. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై అన్నీ వర్గాల్లోను తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దానికితోడు ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఒంగోలు పార్లమెంటు పరధిలో టిడిపి నేతలపై జనాలు బాగా మండిపోతున్నారు. అదేసమయంలో పార్టీ నేతల మధ్య కూడా ఏమాత్రం సఖ్యత కనబడటం లేదు. ప్రతీ నియోజకవర్గంలోను నేతల మధ్య కీచులాటలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏ అభ్యర్ధులు, నేతల మధ్య సమన్వయం కుదర్చటమంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకనే చంద్రబాబు ఎంతగా చెప్పినా మాగుంట ఓ పట్టానా ఎంపిగా పోటీ చేయటానికి అంగీకరించలేదు. చివరకు మాగుంట పెట్టిన షరతులకు చంద్రబాబు ఒప్పుకున్న తర్వాతే ఎంపిగా పోటీ చేయటానికి అంగీకరించారు. దానిప్రకారం ఎర్రగొండపాలెం, కనిరిగి, మార్కాపురం నియోజకవర్గాల్లో తాను చెప్పిన అభ్యర్ధులకే అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబట్టారట. అంతేకాకుండా లోక్ సభ ఎన్నిక ఖర్చు మొత్తం పార్టీనే భరించాలని చెప్పారట. దాంతో వేరే దారిలేక చంద్రబాబు అంగీకరించారట. దాంతో మాగుంట కూడా ఎంపిగా పోటీ చేయటానికి ఒప్పుకున్నారన్నది పార్టీలో జరుగుతున్న ప్రచారం. ఇంత చేసినా మాగుంట టిడిపిలో కొనసాగేది అనుమానమే అంటూ ప్రచారం ఎక్కువవుతోంది. అందుకనే మాగుంట కూడా తాజాగా క్లారిటీ ఇచ్చినట్లున్నారు.