జ్యోతిష్య శాస్త్రంలో పౌర్ణమికి ప్రత్యేకమైన శక్తి ఉందని పండితులు చెబుతుంటారు. చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశించే ఈ రోజు, మనసు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక శక్తులతో నేరుగా సంబంధం కలిగి ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1న రానుండటంతో, ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పండితుల మాటల్లో చెప్పాలంటే, ఈ రోజు దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. గురుబలం లేని వారు, మానసిక అశాంతితో బాధపడేవారు లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ రోజున శివుడు, సూర్యదేవుడు, విష్ణువును ఆరాధిస్తే మంచి ఫలితాలు త్వరగా కనిపిస్తాయని చెబుతారు. పౌర్ణమి చంద్రుడికి సంబంధించినదైనందున, మనసుకు శాంతి కలగాలంటే నవగ్రహ శాంతి పూజలు, చంద్రుడికి సంబంధించిన ఉపాసనలు ఎంతో మేలు చేస్తాయని విశ్వాసం.
మాఘ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి పూజలు ప్రారంభించాలి. వీలైతే నదీస్నానం చేయడం అత్యంత శుభకరమని చెబుతారు. ఈ రోజంతా శుభముహూర్తమే కొనసాగుతుండటంతో, సత్యనారాయణ వ్రతం, రుద్రాభిషేకం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి ఇది అద్భుతమైన సమయంగా భావిస్తారు.
ఈ రోజు అశ్వత్థ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శక్తికి తగిన విధంగా దాన ధర్మాలు చేయడం, పండితులకు దక్షిణ ఇవ్వడం, నవగ్రహ శాంతి హోమాలు చేయించడం వల్ల పూర్వ జన్మ కర్మబంధాలు తగ్గుతాయని నమ్మకం. పితృదేవతల అనుగ్రహం కోసం చేసే కర్మలు కూడా ఈ రోజున త్వరగా ఫలిస్తాయని చెబుతున్నారు.
మాఘ పౌర్ణమి రోజున తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువును, బిల్వపత్రాలతో శివుడిని, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని, తమలపాకులతో హనుమంతుడిని పూజించడం ద్వారా అనేక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. దేవుడికి సిర, పూర్ణం, పాయసం వంటి నైవేద్యాలు సమర్పిస్తే కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు. ఈ రోజున ఉపవాసం పాటించడం మంచిదిగా భావిస్తారు. అయితే గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం వంటి పనులు మాత్రం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.
