పేర్ని నానీ ఇలాకాలో త్రిముఖ పోరు… తెరపైకి కొత్త పేరు!

ఏపీలో నిన్నటివరకూ ద్విముఖ పోరు మాత్రమే అనే చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుకూల ఓటు వైసీపీకి, వ్యతిరేక ఓటు టీడీపీ-జనసేన కూటమికి అనే చర్చ మాత్రమే ఉండేది. ఇక బీజేపీ ఒంటరిగా పోటీచేసే అవకాశాలు ఆల్ మోస్ట్ ఉండవనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో… కలిస్తే టీడీపీ-జనసేన కూటమితో కలుస్తుంది.. వారు కలవని పక్షంలో వామపక్షాలు రెడీగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా… ద్విముఖ పోరు మాత్రమే అనే చర్చ నడిచింది.

అయితే… ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్నారు. వైసీపీలో టిక్కెట్ దొరకని అసంతృప్తులకు, టీడీపీ – జనసేన కూటమిలోని రెబల్స్ కు ఆ పార్టీలో షెల్టర్ దొరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈమేరకు ఇప్పటికే పలువురు నేతలతో షర్మిల & కో టచ్ లోకి వెళ్లారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు కన్ ఫాం అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఆ సంగతి అలా ఉంటే… ఈ త్రిముఖ పోరు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు ఉంటుందనే సంగతి కాసేపు పక్కనపెడితే… కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం కాస్త బలంగానే ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గం మచిలీపట్నంలోనూ త్రిముఖ పోరుకు తెరలేచిందని అంటున్నారు.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పేర్ని నాని పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు రంగంలోకి దిగుతున్నారు. ఈయనకు టిక్కెట్ ఆల్ మోస్ట్ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క టీడీపీ – జనసేన కూటమి నుంచి మాజీమంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగుతున్నారు. దీంతో… వీరిద్దరిమధ్యా బందరులో రసవత్తర పోరు కన్ ఫాం అనే చర్చ ఇన్నాళ్లూ నడిచింది.

అయితే సడన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ, సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన కోన ఫౌండేషన్ చైర్మన్ కోన నాగార్జునను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల భ‌ర్త, బ్రదర్ అనిల్ కుమార్‌ తో కోన‌కు మాంచి స్నేహం ఉందని.. ఫలితంగా ఆయన ఆహ్వానం మేరకు కోన కాంగ్రెస్ లో చేరి, బందరు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

ఈ మేరకు వైఎస్ షర్మిల నుంచి నాగార్జునకు ఆఫ్ ద రికార్డ్ హామీ వచ్చిందని చెబుతున్నారు. దీంతో కోన అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయ్యిందని కాంగ్రెస్ నేతల నుంచే మాటలు వినిపిస్తున్నాయి. బందరులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎక్కువగానే ఉంటాయని.. ఇదే సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ కి సంబంధించిన సువార్త సభలు కూడా అక్కడ ఎక్కువగానే జరుగుతుంటాయని.. ఫలితంగా బందరులో త్రిముఖ పోరు తప్పదని అంటున్నారు పరిశీలకులు.