ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టిన చీవాట్లు పని చేశాయేమో.! వైసీపీ అధినేత, చేసిన హెచ్చరికలు గట్టిగానే పని చేశాయేమో.! వైసీపీ ముఖ్య నేతలంతా జనంలోకి వెళ్ళారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అందించే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా, ‘వై నాట్ 175’ అనే నినాదంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే కార్యక్రమానికి అధికార వైసీపీ శ్రీకారం చుట్టింది. అక్కడక్కడా కొన్ని నిలదీతలు మినహాయిస్తే, తొలి రోజు ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం సూపర్ హిట్ అయినట్లే చెప్పుకోవాలేమో. సంక్షేమ పథకాలు సకాలంలో అందుతుండడం.. దాంతోపాటుగా, వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ జరిగిన కొద్ది రోజులకే ఈ కార్యక్రమం ప్రారంభమవడం.. వెరసి.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమం పట్ల పెద్దగా ఎక్కడా వ్యతిరేకత లేదు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు.. భుజాన ఓ సంచీ తగిలించుకుని, ఇళ్ళకు వెళ్ళి, ప్రజలతో మాట్లాడుతూ, ఆయా ఇళ్ళకు స్టిక్కర్లు అంటిస్తున్న కార్యక్రమం సహజంగానే చూడముచ్చటగా వుంటుంది. ప్రజా ప్రతినిథులు తమ ఇళ్ళకు వస్తే, సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న భరోసా ప్రజల్లో కలుగుతుంది మరి.
‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్నీ ఇదే ఉద్దేశ్యంతో ప్రారంభించినా, ఎందుకో.. అదంత సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ల వ్యవహారం ముందు ముందు ఎలా వుంటుందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. కాగా, కొన్ని చోట్ల వైసీపీ నేతలు ఇలా వెళ్ళగానే, అలా ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ స్టిక్కర్లు పీకి పారేస్తుండడం గమనార్హం.