వారసులను పోటీ చేయించే విషయంలో చంద్రబాబునాయుడు మాట చెల్లుబాటు కాలేదా ? ప్రకటించిన టికెట్లను చూస్తుంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే, తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంతమంది వారసులు ఎప్పుడూ పోటీ చేయలేదు. రాబోయే ఎన్నికల్లో లోకేష్ తో కలిపి 10 మంది వారసులు పోటీ చేస్తున్నారు.
మొదట్లో తన కొడుకు నారా లోకేష్ ను మాత్రమే పోటీ చేయించాలని అనుకున్నారు. ఇతర నేతల వారసులను 2024 ఎన్నికల వరకూ పోటీకి అవకాశం ఇవ్వకూడదని అనుకున్నారు. అందుకనే వారసులకు టికెట్లు అడిగిన నేతకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ జేసి సోదరుల డిమాండ్ తో పార్టీలో సీన్ మొత్తం మారిపోయింది. అనంతపురం ఎంపిగా తాడిపత్రి నియోజకవర్గంలో తమకు బదులుగా తమ వారసులు పోటీ చేస్తారనే చంద్రబాబును అడక్కుండాత వారంతట వారే ప్రకటించేసుకున్నారు.
జేసి బ్రదర్స్ నిర్ణయంతో చంద్రబాబుకు మండిపోయినా కానీ ఏం చేయలేని పరిస్ధితి. వేరే దారిలేక జేసి బ్రదర్స్ వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సొచ్చింది. అదే అదునుగా కర్నూలు జిల్లా పత్తికొండలో కెఇ కృష్ణమూర్తి వారసుడిగా కెఇ శ్యాంబాబు, శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు సుందర శ్యాం శివాజి కూతురు శిరీష, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమిడి మృణాళిని కొడుకు కిమిడి నాగార్జున రంగంలోకి దిగుతున్నారు.
అలాగే, రాజమండ్రి అర్బన్ లో దివంగత నేత కింజరాపు యర్నన్నాయడు కూతురు ఆదిరెడ్డి భవానీ, గుడివాడలో దేవినేని అవినాష్, విజయవాడ పశ్చిమ సిగ్మెంట్లో జలీల్ ఖాన్ కూతుతు షబానా ఖాతూన్, రాప్తాడులో సునీత కొడుకు పరిటాల శ్రీరామ్, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి, నగిరిలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. సరే నారా లోకేష్ ఎలాగూ గుంటూరు జిల్లా మంగళగిరిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.