100 రోజుల లోకేష్ యువగళం.! బాగానే నెట్టుకొచ్చేశాడు.!

ఔను, బాగానే నెట్టుకొచ్చేశాడు.! నారా లోకేష్ యువగళం పాదయాత్ర పట్ల టీడీపీ శ్రేణుల్లోనే జరుగుతున్న చర్చ ఇది. నారా లోకేష్ వల్ల, టీడీపీకి లాభం లేకపోగా, నష్టమే.. అని ఇప్పటిదాకా చాలామంది టీడీపీ సీనియర్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. కొందరు, టీడీపీని అదే కారణంతో వీడి వెళ్ళారు కూడా.

లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజునే, తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత కోలుకోలేదు.. కొద్ది రోజులకే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు తారకరత్న. అది పాదయాత్రపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని అంతా అనుకున్నారు.

కానీ, నారా లోకేష్ తన పాదయాత్రను పట్టుదలతోనే కొనసాగిస్తూ వస్తున్నారు. వంద రోజులకు చేరుకుంది లోకేష్ పాదయాత్ర. వెయ్యి కిలోమీటర్లపైనే ఇప్పటిదాకా పాదయాత్ర జరిగింది. నెలవారీ వేతనాలు చెల్లించి మరీ పాదయాత్ర వెంట జనాన్ని మోహరిస్తున్నారన్న ఆరోపణల సంగతి పక్కన పెడితే, దాదాపు నిర్విరామంగా సాగుతున్న పాదయాత్రను అభినందించి తీరాల్సిందే.

పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందా.? ఇప్పటిదాకా అయితే అదే జరిగింది. ఇకపై ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ లోకేష్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నిలబెట్టాలనుకుంటే మాత్రం, టీడీపీ ఖేల్ ఖతం.! అందుకే, ఆ రిస్క్ తీసుకోరు చంద్రబాబు.!

2024 ఎన్నికల కోసం జనసేన, బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు, లోకేష్ పాదయాత్ర వల్ల వచ్చిన అదనపు లాభంతో అధికార పీఠమెక్కుతారేమో చూడాలి.!