ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి కూడా ఒకటి. మంగళగిరికి మామూలుగా అయితే ఇంత ప్రాధాన్యత వచ్చే అవకాశం లేదు. మరి ఎందుకింత ప్రాధాన్యత దక్కింది ? ఎందుకంటే ఇక్కడ నుండి నారా వారి పుత్రరత్నం నారా లోకేష్ పోటీ చేయటమే.
మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోకేష్ తనకు మంగళగిరిని ఎంచుకున్నారు. అయితే తాజ సమాచారం ప్రకారం మొదటిరౌండు పూర్తయ్యేసరికి వెనకబడి ఉన్నారు. వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. నిజానికి ఆళ్ళ ముందు లోకేష్ ఏ విషయంలో కూడా పనికిరారు. కాకపోతే చంద్రబాబునాయుడు కొడుకు కాబట్టి లోకేష్ పోటీ విషయం ప్రిస్టేజ్ అయిపోయింది.
మొదటి నుండి లోకేష్ ఇక్కడ గెలుస్తారనే నమ్మకం ఎవరిలోను లేదు. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆర్ధిక, అంగబలాలకు లోటు లేదు కాబట్టి, మీడియా మద్దతుతో దూసుకుపోతున్నట్లు ప్రచారం చేయించుకున్నారు. తీరా పోలింగ్ రోజున తెలిసిపోయింది అయ్యవారి ప్రతాపం ఏమిటో. పోలింగ్ చివరి గంటలో రెండు మూడు కేంద్రాల దగ్గర స్వయంగా లోకేషే ధర్నాలకు దిగటంతోనే గెలుపు అనుమానమే అని తేలిపోయింది.
దానికి తగ్గట్లే ఉదయం మొదలైన పోస్టల్ బ్యాలెట్లలోను ఆళ్ళకే ఆధిక్యత దక్కింది. చివరకు రెండో రౌండు ఈవిఎంల లెక్కింపు లో కూడా లోకేష్ వెనకబడ్డారు. ఒక్క లోకేష్ అనే కాదులేండి మంత్రుల్లో అచ్చెన్నాయడు, సోమిరెడ్డి చంద్రమొహన్ రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, ఆదినారాయణరెడ్డి కూడా వెనకబడే ఉన్నారు. చూడబోతే మంత్రుల్లో ఏ ఒకరో, ఇద్దరు మాత్రమే గెలిచేట్లున్నారు.