2019లో లోకేష్ టార్గెట్ ఏంటో తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో నారావారి సుపుత్రుడు నారా లోకేష్ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో తెలుసా ? రాష్ట్రంలోని 25 ఎంపి సీట్లూ గెలిచి జాతీయ స్ధాయిలో టిడిపి చక్రం తిప్పాలట. అంటే లోకేష్ లో దింపుడుకళ్ళెం ఆశలు ఉన్నట్లు కనబడుతోంది. 25 ఎంపి సీట్లు గెలిచి ప్రధానమంత్రి అభ్యర్ధిని ఎవరో నిర్ణయించేది కూడా చంద్రబాబేనట. నిజంగా ఆశకు కూడా అంతుండాలని అందుకే పెద్దలు చెప్పేది. దుబాయ్ పర్యటనలో ఉన్న లోకేష్ చెప్పిన మాటలు విని టిడిపి నేతలే ఆశ్చర్యపోతున్నారు. వయస్సయిపోయిన చంద్రబాబునాయుడు చెప్పారంటే అర్ధముంది. వయస్సు రీత్యా చాలా చిన్నవాడైన లోకేష్ కూడా చంద్రబాబులాగానే మాట్లాడుతుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

పార్టీ పరిస్ధితి రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతున్నది వాస్తవం. ఏ జిల్లాలో చూసినా పార్టీలో అంతర్గతంగా కొట్టేసుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాలో అయితే గొడవలు తారస్ధాయికి చేరుకున్నాయి. గొడవలు సర్దుబాటు చేద్దామని స్వయంగా చంద్రబాబు ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నేతల సంగతి పక్కనపెట్టినా అసలు చంద్రబాబులోనే కనిపించటం లేదు. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

పార్టీ పరిస్ధితిపై ప్రతీ నెలా చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. ఏ సర్వేలో కూడా సానుకూల సంకేతాలు కనబడటం లేదని సమాచారం. ఇక, జాతీయ మీడియా సంస్ధలు నిర్వహిస్తున్న సర్వేల్లో ఎందులో కూడా చంద్రబాబు సోదిలోకి కూడా కనబడటం లేదు. అంటే ఏ సర్వే చూసినా వైసిపిదే ఆధిక్యమని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో అన్నీ ఎంపి సీట్లు టిడిపి గెలుస్తుందంటే నమ్మే వెంగళ్ళప్పలు ఎవరూ లేరు. పైగా జాతీయ స్ధాయిలో చక్రం తిప్పటమే కాకుండా ప్రధానిని ఎవరో కూడా నిర్ణయిస్తుందట. 25 సీట్లు గెలుచుకున్న టిడిపినే జాతీయస్ధాయిలో చక్రం తప్పటంతో పాటు ప్రధానిని నిర్ణయిస్తుంటే మిగిలిన పార్టీలు చూస్తు ఊరుకుంటాయా ?

 

ఏపికన్నా లోక్ సభ స్ధానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు ధక్షిణాదిలోనే ఉన్నాయి. ఇక ఉత్తరాధి రాష్ట్రాల సంగతిని తీసుకుంటే ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్,  మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాలున్నాయి. పై రాష్ట్రల్లోని నేతుల శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, మమతాబెనర్జీ, ములాయంసింగ్ యాదవ్ లాంటి నేతలు జాతీయ రాజకీయాల్లో ఎప్పటి నుండో చక్రం తిప్పుతున్నారు. మరి, వాటి మాటేంటి ? కొత్త బిచ్చగాడు తిరిగినట్లు తిరుగుతున్న చంద్రబాబుకు జాతీయ రాజకీయాల పగ్గాలొదిలేసి మిగిలిన వాళ్ళు నోట్లో వేలేసుకుని కూర్చుంటారా ? ఏంటో చంద్రబాబు, చినబాబు లోకేష్ ఒకే పద్దతిలో మాట్లాడుతున్నారు.