కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధికారప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యతో రాయలసీమ ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలా జరగడం సంచలనానికి దారితీసింది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా టీడీపీ నేతలంతా ఈ హత్యను ఖండించారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కానీ రాయలసీమలో తెలుగుదేశం బాగా బలహీనపడటం, కడప జిల్లాలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరు కూడ లేకపోవడంతో ఈ వివాదం త్వరగానే మరుగనపడిపోతుందని, ఒక మామూలు మిగిలిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఆందోళనపడ్డారు.
కానీ నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. బుధవారం సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రొద్దుటూరుకు చేరుకున్న లోకేష్ మెరుపు నిరసనకు దిగారు. సుబ్బయ్య భౌతికకాయం వద్దనే కూర్చొని న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ప్రకటించారు. ఈ హత్యలో ప్రధానంగా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాధల పేర్లు వినబడ్డాయి. వాళ్ళే తన భర్తను హత్యచేశారని సుబ్బయ్య సతీమణి మొదటి నుండి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ సైతం వారి ముగ్గురు మీద కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. లోకేష్ పోరాటానికి దిగడంతో జిల్లా టీడీపీ శ్రేణులు ముందుకు దూకాయి.
భారీ సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు సుబ్బయ్య ఇంటి వద్దకు చేరుకొని లోకేష్ నిరసనకు సంఘీభావం తెలిపారు. ప్రతిపక్షం నుండి ఆందోళన ఉంటుందని ఊహించారు కానీ ఈ స్థాయిలో ఉంటుందని, లోకేష్ ఇలా స్పాట్లోనే పోరాటం స్టార్ట్ చేస్తారని అధికార పక్షం నేతలు సైతం ఊహించలేదు. లోకేష్ మీద మొదటి నుండి తీసివేత ధోరణిలో ఉన్న వారంతా లోకేష్ మాటలను పట్టించుకోలేదు. కానీ కొద్ది సమయంలోనే లోకేష్ పోరాటం పెద్దది అయిపోయింది. భారీగా మోహరించిన పోలీసులు సైతం ఉద్రిక్త్ర పరిస్థితులు చోటు చేసుకుంటే కష్టమని ఊహించారో ఏమో లోకేష్ తో చర్చలు జరిపారు. సుబ్బయ్య సతీమణి స్టేట్మెంట్ నమోదుచేసి ఎమ్మెల్యే, ఆయన బావమరిది, మున్సిపల్ కమీషనర్ పేర్లను కోర్టు ద్వారా నిందితుల జాబితాలో చేర్చడానికి అంగీకరించారు. అలా లోకేష్ పోరాటం పాక్షికంగా విజయవంతమైందనే అనాలి. ఇక దర్యాప్తులో నిజానిజాలు బయటపడి అసలైన నిందితులకు శిక్ష పడితే సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరిగినట్టే.