నారా లోకేష్ పాదయాత్ర: టీడీపీ ఓటు బ్యాంకు తగ్గుతోందా.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ గళం పాదయాత్ర కారణంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరుగుతుందనుకుంటే, అది కాస్తా తగ్గుతోందిట. ఇదేదో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శ కాదు. టీడీపీ శ్రేణుల్లోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇది.

అసలు విషయమేంటంటే, నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజే, ఆ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరణం అనేది చెప్పి రాదు. కేవలం పాదయాత్రలో పాల్గొనడం వల్లే తారకరత్నకి గుండె పోటు వచ్చిందని అనడమూ సబబు కాదు.

కాకపోతే, నారా కుటుంబం వల్ల నందమూరి కుటుంబానికి ప్రాణహాని.. అన్న చర్చ ఎప్పటినుంచో వుంది. దానికి తారకరత్న మరణంతో ఇంకాస్త బలం చేకూరిందని అనొచ్చేమో. ఎవరి మనోభావాలు వాళ్ళవి. టీడీపీలో నందమూరి అభిమానులు అలా అనుకుంటున్నారు. దీనికి తోడు, తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీయార్‌ని నందమూరి బాలకృష్ణ పట్టించుకోలేదన్న రచ్చ తెరపైకొచ్చింది. ఇలా వరుస వ్యవహారాలు, టీడీపీలో నందమూరి అభిమానులు కొంత గుస్సా అయ్యే పరిస్థితికి కారణమయ్యింది. మరోపక్క, లోకేష్ పాదయాత్రలో జనం ఒక్కోసారి పెద్దగా కనిపించకపోవడంతో, పార్టీ శ్రేణుల్లోనూ నమ్మకం సన్నగిల్లుతోంది.

ఇంకోపక్క, తాజాగా వెలుగు చూస్తున్న కొన్ని సర్వేలు, అద్భుతం జరిగితే టీడీపీ బొటాబొటి మెజార్టీతో గట్టెక్కొచ్చని చెబుతున్నాయి. అవి కూడా టీడీపీ అనుకూల సర్వేలు కావడం గమనార్హం. అంటే, టీడీపీలోనే ‘ఓటు బ్యాంకు పతనమౌతోంది’ అన్న చర్చ జరగడం సబబేనన్నమాట.