లోకేష్ యువగళం – తారకరత్నకి గుండెపోటు.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్రను ఈ రోజు ఉదయం ప్రారంభించారు. నారా లోకేష్ మేనమామ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా, సినీ నటుడు నందమూరి తారకరత్న సహా పలువురు టీడీపీ నాయకులు నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. అనూహ్యంగా నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో, టీడీపీ శ్రేణులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ఆసుపత్రికి వచ్చే సమయానికి పల్స్ లేదనీ, సీపీఆర్ చేశాక పల్స్ పునరుద్ధరణ జరిగిందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం నందమూరి తారక రత్నను బెంగళూరుకి తరలించనున్నట్లు తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులని అడిగి తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ, అవసరమైన వైద్య సహాయం నిమిత్తం.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది నెలలుగా తారక రత్న ఏపీ రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తారకరత్న ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం, పరిటాల.. ఇలా రాయలసీమల గత కొద్ది రోజులుగా మకాం వేశారాయన. అంతకు ముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తిరిగారు. క్షణం తీరిక లేకుండా రాజకీయ కార్యకలాపాల్ని నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారన్న ప్రచారం జరుగుతోంది తారకరత్న విషయంలో.