నారా చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగేశారు.. పాదయాత్ర చేసేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన రసాభాసగా మారింది. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు ఆ రోడ్ షోని అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలకీ, పోలీసులకీ మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ‘పోలీసులకు సహాయ నిరాకరణ..’ అంటూ చంద్రబాబు ప్రకటించేశారు. అదే పోలీసులు గనుక సహాయ నిరాకరణ.. అంటే, అది వేరేలా వుంటుందని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తెలుసుకోకపోతే ఎలా.?
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నేపథ్యంలో, పోలీసులు విపక్షాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది నిర్వివాదాంశం. ప్రత్యేక అనుమతులు పొందాల్సి వస్తోంది రాజకీయ పార్టీలు. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి, పోలీసులు ఆయా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగిస్తుండడం.. అధికార పార్టీ రాజకీయమే.!
ఇక, చంద్రబాబు.. తనకు దక్కిన సువర్ణావకాశాన్ని ఎలా వదులుకుంటారు.? రంగంలోకి దిగేశారు.. నడుచుకుంటూ వెళ్ళిపోయారు. బహిరంగ సభ జరగాల్సిన ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలో రోడ్ షో నిలిచిపోవడంత.. ఆ ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని నడకతోనే పూర్తి చేసెయాలనుకున్నారు.
కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు. దాంతో.. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. లోకేష్ పాదయాత్ర వెలవెలబోతోంటే.. చంద్రబాబు పాదయాత్ర మాత్రం వెలిగిపోతుండడం విశేషమే మరి.!