ఈ టిఆర్ ఎస్ అభ్యర్థి మాకొద్దు సారూ…

గ్రేట‌ర్ హైద‌రాబాద్  టిఆర్ ఎస్ లో కూడ అసమ్మతిజోరుగా  మొదలయింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చాలా గర్వంగా అసెంబ్లీ కి పోటీచేసే అభ్యర్థులంటూ 105 పేర్ల జాబితా విడుదలయిందో లేదో చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి అంటుకుంది.  

 

ముఖ్యమంత్రి ఎంపిక చేసిన  అభ్య‌ర్ధుల ట్రాక్ రికార్డు స‌రిగ్గా లేదనో, లాయల్ నాయకులను విస్మరించారనో, ఆ క్యాండిడేట్ వద్దనో…  ఏదో ఒక కారణంచేత  అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. పార్టీ నాయకులు ముందే నిరసన గళం విప్పుతున్నారు.చాలా చోట్ల అభ్య‌ర్దుల‌ను మార్చాలని బ‌హిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఎవరు అప్పాయంట్ మెంట్ కోరినా ముఖ్యమంత్రి కార్యాలయం తిరస్కరిస్తూ ఉంది.

 

 ఎల్ బినగర్ నియోజకవర్గంలోని తిరుగుబాటు ప్రకటించిన వాళ్లెవరో కార్యకర్తలుకాదు, ఏకంగా కార్పొరేటర్లే. అక్కడ అభ్య‌ర్ధి రామ్మోహ‌న్ గౌడ్ ని మార్చాలంటున్న పార్టీ లోకల్ నాయకులతో వాళ్లు గొంతకలిపారు.  అభ్య‌ర్ధిని మార్చాల్సిందేనని ఏడుగురు కార్పొరేటర్లు రెండు రోజులుగా కోరుతున్నారు. తమ వాదన వినకపోతే పార్టీకే నష్టం జ‌రుగుతంద‌ని హెచ్చరిస్తున్నారు.

 

ఈ విషయం కేటీఆర్ దృష్టికి  కూడా తీసుకెళ్లారు. నియోజ‌క వ‌ర్గంలోని కిందిస్థాయి కేడర్ కూడా రామ్మెహ‌న్ గౌడ్ అభ్య‌ర్ధిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ అసమ్మతికాదని అతనికే టిక్కెట్ ఇస్తే ఓడిపోవ‌డం ఖాయమని చెబుతున్నారు.  ఎల్ బినగర్ నియోజకవర్గాని టిఆర్ ఎస్ కైవసం చేసుకోవాలంటే రామ్మోహన్ గౌడ్ ని మార్చాల్సిందేనని  కార్పొరేటర్లు వాదిస్తున్నారు.గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య గెలుపొందాడు.

 

లోకల్ కార్యకర్తల నుంచి రామ్మోహన్ గౌడ్ మీద వ్యతిరేకత రావడంతో  కార్పొరేటర్లంతా సమావేశమయిన  అభ్యర్ధిని మార్చేందుకు నాయకత్వం మీద వత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.  కేవలం పార్టీ గెలవాలన్న లక్ష్యంతోనే తాము అభ్యర్ధిని మార్చాలని కోరుతున్నట్టు వారు చెబుతున్నారు.