ఎన్ఐఏకి స్ధానిక పోలీసుల షాక్ ..కారణం అదేనా ?

ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏకి స్ధానిక పోలీసులు షాక్ ఇచ్చారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు వివరాలను ఇవ్వలేమని ఎన్ఐఏకి తేల్చి చెప్పటంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారట. పోయిన సంవత్సరం అక్బోటర్ 25వ తేదీన జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను హై కోర్టు ఎన్ఐఏకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కేసు విచారణను కేంద్రానికి అప్పగించటం రాష్ట్రప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, కేంద్ర దర్యాప్తు సంస్ధ గనుక హత్యాయత్నం కేసును విచారిస్తే హత్యాయత్నం కుట్ర వెనుక ఉన్న ముఖ్యులందరూ బయటకు వస్తారు. అదే గనుక జరిగితే తెలుగుదేశంపార్టీలో చాలామంది కీలక నేతలు రోడ్డున పడతారు. అంతేకాకుండా చివరకు జైలుకు కూడా వెళ్ళాల్సుంటుంది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్ఐఏ విచారణ మొదలవ్వటం చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ఐఏ విచారణలో హత్యాయత్నం వెనుక సూత్రదారుల పాత్ర బయటపడితే, విచారణ నిమ్మితం అదుపులోకి తీసుకుంటే రేపటి ఎన్నికల్లో ఆ విషయం తీవ్ర ప్రబావం చూపుతుందన్న ఆందోళన టిడిపిలో కనబడుతోంది. అందుకే ఎన్ఐఏకి ఎట్టి పరిస్దితుల్లోను సహకరించకూడదని అనధికారికంగా విశాఖపట్నం పోలీసులకు ఆదేశాలు అందినట్లు జగన్ మీడియా ఆరోపిస్తోంది. దానికితోడు హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే డిజిపి ఠాకూర్, చంద్రబాబు, మంత్రులు, విశాఖపట్నం పోలీసు కమీషనర్ చేసిన ప్రకటనలు అనుమానాలను కలిగిస్తున్నాయి. జగన్ పై జరిగిన దాడి కేవలం అంతా డ్రామాగా చంద్రబాబు అండ్ కో మొదటి నుండి ఎగతాళి చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అందుకు తగ్గట్లే జగన్ పై జరిగిన హత్యాయత్నం కుట్రలో చంద్రబాబే సూత్రదారి అంటూ వైసిపి ఎదురుదాడి మొదలుపెట్టింది.

ఇన్ని గందరగోళాల మధ్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ తో విచారణ చేయిస్తే కుట్ర వెనుక సూత్రదారులు బయటకు రారంటూ జగన్ థర్డ్ పార్టీ విచారణను కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు. దాని ఫలితంగా హైకోర్టు కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. అప్పటి నుండి రాష్ట్రం మండిపోతుంది. అదే సమయంలో జనవరి 1వ తేదీన జగన్ పై హత్యాయత్నం కేసుపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేసింది. అందులో భాగంగానే శుక్రవారం హైకోర్టు ఆదేశాలివ్వగానే శనివారం ఉదయానికల్లా విచారణ మొదలైపోయింది.

విచారణలో భాగంగా శనివారం విశాఖపట్నం వచ్చిన ఎన్ఐఏ అధికారులకు సహకరించటానికి స్ధానిక పోలీసులు ఇష్టపడలేదట. కేసు విచారణలో ఎన్ఐఏకి సహకరించాలని తమకు రాష్ట్రప్రభుత్వం నుండి ఉత్తర్వులు వస్తే కానీ కేసు ఫైలును ఇవ్వలేమని స్ధానిక పోలీసులు ఎన్ఐఏ ఉన్నతాధికారలకు స్పష్టం చేశారట. అంటే కోర్టు ఉత్తర్వులను కూడా స్ధానిక పోలీసులు లెక్క చేయటం లేదని అర్ధమైపోతోంది. స్ధానిక పోలీసుల తీరు చూస్తుంటే కేసును నీరుగార్చటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అర్దమైపోతోంది. మరి ఈ పరిస్దితుల్లో ఎన్ఐఏ ఏ చేస్తుందో చూడాలి.