లోకల్ వర్సెస్ నాన్ లోకల్: కుప్పంలో వైఎస్ జగన్ రేపిన రాజకీయ ప్రకపంన.!

Ys Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ ఏం మాట్లాడతారన్నదానిపై వైసీపీ వర్గాల్లోనూ, టీడీపీ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కుప్పం వెళ్ళారు వైఎస్ జగన్. తన సహజ శైలికి తగ్గట్టే రాజకీయ విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అద్భుతాలు చస్తోందనీ చెప్పుకున్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ‘లోకల్ వర్సెస్ నాన్ లోకల్’ అంశం కుప్పంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి నాన్ లోకల్ అనీ, హైద్రాబాద్‌కి లోకల్ అనీ వైఎస్ జగన్ విమర్శించారు. ఆయన నిజానికి గతంలోనూ ఇలాంటి విమర్శలు చేశారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు కుప్పంలోనే వుండిపోయారంటూ అప్పట్లో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు చాలామంది విమర్శించారు.

నిజానికి, వైసీపీ నేతలు చాలామంది కోవిడ్ సోకినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా, తెలంగాణకే వెళ్ళి వైద్య చికిత్స పొందారనుకోండి.. అది వేరే వ్యవహారం. కాకపోతే, ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంశమే ఒకింత ఆశ్చర్యకరంగా మారింది.

కడప ఎంపీగా వున్నప్పుడూ, పులివెందుల ఎమ్మెల్యేగా వున్నప్పుడూ.. వైఎస్ జగన్.. తన సొంత ప్రాంతంలో ఎక్కువగా లేరు. హైద్రాబాద్‌లోనే వుండేవారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసినా, వారాంతంలో తిరిగి హైద్రాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చేది.. కోర్టు కేసుల నిమిత్తమే అయినాసరే.!

ఎలా చూసుకున్నా నాన్ లోకల్ విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ ఇద్దరే. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతిలో ఇల్లు లేదు. చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు కట్టుకోలేదనుకోండి.. అది వేరే సంగతి. కుప్పంలో చంద్రబాబుకి సొంత ఇల్లు వుంది. వైఎస్ జగన్‌కి పులివెందులలో సొంత ఇల్లు వుంది.

లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. ఈ వ్యవహారం ఇంకెంత ముదిరి పాకాన పడుతుందోగానీ, ఈ ఎఫెక్ట్ పులివెందులకు పాకకుండా వైఎస్ జగన్ చూసుకోవాల్సి వుంటుంది.