జనసేన ‘వారాహి’కి తెలంగాణలో లైన్ క్లియర్.! ఏపీలో పరిస్థితేంటి.?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేయడానికి తెలంగాణలో ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ వాహనానికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. వాహన రిజిస్ట్రేషన్ కూడా తెలంగాణలో పూర్తయిపోయింది.

ఈ ‘వారాహి’ వాహనానికి వాడిన రంగు ‘ఆలివ్ గ్రీన్’ అని తొలుత ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో జనసేన వ్యూహానికి వైసీపీ క్లీన్ బౌల్డ్ అయిపోయిందని చెప్పక తప్పదు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం ‘వారాహి’ రంగుపై గుండెలు బాదుకున్నారు.. వెటకారాలు చేశారు.

నాన్సెన్స్.. వాహనం రంగు గురించి రాజకీయ రచ్చ చేయడమేంటి.? అన్న కనీసపాటి ఇంగితాన్ని వైసీపీ నేతలు పాటించలేకపోయారు. ఫలితం, ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితి. అధినేత మెప్పు కోసమే వైసీపీ నేతలు బహుశా ఇలాంటి వివాదాలతో అభాసుపాలవుతున్నారేమో.!

చివరికి ఏమయ్యింది.? ‘వారాహి’ వాహనానికి తెలంగాణలో లైన్ క్లియర్ అయ్యింది. ఓ రాష్ట్రంలో వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తయితే, అది ఎక్కడైనా తిరగొచ్చు. దానికి ప్రత్యేకంగా అదనపు నిబంధనలేమీ వుండవు ఆయా రాష్ట్రాల్లో.

అసలు, ఏపీలో ‘వారాహి’ వాహనాన్ని తిరగనివ్వబోం.. దానికి రాష్ట్రంలో తిరిగేందుకు అనుమతులు ఇవ్వబడవు.. అని కొందరు వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అభాసుపాలయ్యారు.

వాహనానికి వాడిన రంగు ఆలివ్ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అని తేలింది. వాహన టైర్లు, వాహనానికి చేసిన ఇతర ఏర్పాట్లు.. వీటన్నిటిపైనా వైసీపీ నేతలు నానా యాగీ చేశారు. ఏపీ రవాణా శాఖ అధికారి ఒకరు కూడా అనవసరపు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళంతా ఇప్పుడు మాట మాట్లాడలేని పరిస్థితి వచ్చింది.