రాహుల్ గాంధీలానే పవన్ కళ్యాణ్ కూడా.!

ఒక్క కేసు.. రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఎంపీ పదవిని పోగొట్టుకున్నారాయన. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోయారు. మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరగబోతోంది.?

వాలంటీర్ వ్యవస్థపైనా, వాలంటీర్లపైనా అత్యంత అసభ్యకరమైన ఆరోపణలు చేశారన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సర్కారు మోపుతున్న అభియోగం. పవన్ కళ్యాణ్‌పై ప్రాసిక్యూషన్ దిశగా జగన్ సర్కారు జీవో జారీ చేసింది.

ఈ కేసులో పవన్ కళ్యాణ్ దోషిగా తేలతారా.? తేలితే, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారా.? ఒకవేళ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే, ఆ తర్వాత దోషిగా తేలే పరిస్థితి వస్తే.. ఈ చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

అసలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలేంటి.? అంటూ ఇప్పుడు తీరిగ్గా ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర సందర్భంగా జనసేన అధినేత, వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేపట్టింది.

పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారుగానీ, ‘ప్రాసిక్యూషన్’ విషయమై జనసేన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. ‘రాహుల్ గాంధీలానే పవన్ కళ్యాణ్ కూడా..’ అంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు తమ తమ విశ్లేషణలు చేస్తూ, జనసేన శ్రేణుల్లో భయం నింపుతున్నారు.

ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యవహారంతో రాహుల్ గాంధీ మీద సింపతీ పెరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యవహారం బోల్డంత ఎనర్జీ కూడా ఇచ్చింది. బీజేపీ ఇమేజ్ పడిపోయేలా చేసింది. ఈ ఈక్వేషన్ ఏపీకి వర్తింపజేస్తేనో.!