Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కి ప్రాణహాని.! కానీ, ఎవరి నుంచి.?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అధికార వైసీపీని ప్రశ్నించడంలో కొంత సఫలమవుతున్నారు, కొంత విఫలమవుతున్నారు. టీడీపీ లైన్ తీసుకోకుండా వుంటే, ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ రాణించే అవకాశాలుంటాయి.. చట్టసభలకు వెళ్ళేందుకూ మార్గం సుగమం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న పొలిటికల్ వాక్యూమ్‌ని ప్రతిపక్షం కోణంలో పవణ్ కళ్యాణ్ భర్తీ చేయడానికి అవకాశముంటుంది.

కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతున్నాయి. పోనీ, ఆ తెలుగుదేశం పార్టీ వల్ల జనసేనకు ఏమన్నా ఉపయోగముందా.? అంటే, అదీ లేదాయె.! పైగా, టీడీపీ నుంచి జనసేనకు నస్టమే ఎక్కువగా జరుగుతోంది.

జనసేన వల్ల టీడీపీ లాభపడుతోంది.. టీడీపీ కారణంగా జనసేన నష్టపోతోంది. ఈ విషయమై జనసేనలో చాలామంది నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అధినేతకు ఆ విషయాన్ని చెప్పేందుకు వారికి అవకాశమే చిక్కడంలేదన్నవాదన వుంది.

అయితే, టీడీపీకి వున్న ఓటు బ్యాంకు నేపథ్యంలో.. అది జనసేన వైపుకు వస్తే.. రాజకీయంగా లాభపడొచ్చని పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేయొచ్చు. కానీ, టీడీపీ మార్కు రాజకీయాలు.. జనసేనకు ఉపయోగపడవు. ఒకవేళ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా, జనసేన వైపు కొన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓటు బ్యాంకు టర్నౌట్ అవదు. జనసేన శ్రేణులు మాత్రం చిత్తశుద్ధితో టీడీపీకి సహకరించేస్తారు.

ఇలా చూసుకున్నప్పుడు, జనసేనానికి ప్రాణహాని అన్న ప్రస్తావన అంటూ వస్తే.. అది టీడీపీ వైపునుంచే తప్ప, వైసీపీ నుంచి కాదన్నది సర్వత్రా జరుగుతోన్న చర్చ. రాజకీయంగా జనసేనను దెబ్బతీస్తున్న వైసీపీ కాదు, టీడీపీ.! అలాంటప్పుడు ప్రాణహాని విషయంలో అయినా, టీడీపీ వైపే అనుమానంగా చూడాలన్నది జనసేన పట్ల కాస్తో కూస్తో సాఫ్ట్ కార్నర్ వున్న చాలామంది ‘వెల్ విషర్స్’ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.