టీడీపీ, జనసేన వెంట పడుతున్న వామపక్షాలు.!

‘బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే మీతో కలిసి మేం నడుస్తాం..’ అంటూ వామపక్షాలు, తెలుగుదేశం పార్టీకీ అలాగే జనసేన పార్టీకీ సూచిస్తున్నాయట. ప్రస్తుతానికైతే, జనసేన – బీజేపీ మధ్య మాత్రమే అధికారికంగా పొత్తు వుంది. టీడీపీతో జనసేన కలిసి పని చేస్తుందని ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారం సాక్షిగా జనసేనాని ప్రకటించాక, బీజేపీలో కొంత అయోమయం నెలకొంది.

వాస్తవానికి, ఎక్కువ ఎంపీ సీట్లను ఆశిస్తున్న బీజేపీ, పది వరకు అసెంబ్లీ సీట్లను కూడా టీడీపీ – జనసేన నుంచి ఆశిస్తుండడం గమనార్హం. పదిహేను అసెంబ్లీ సీట్లు, 5 నుంచి 7 వరకు ఎంపీ సీట్లను జనసేన ఆశిస్తుండడంపై టీడీపీ, జనసేన అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

జనసేనకే ఐదు ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంత సిద్ధంగా లేదు. ఓ పాతిక నుంచి ముప్ఫయ్ అసెంబ్లీ సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తామంటోంది టీడీపీ. అయితే, జనసేన 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లనూ 7 నుంచి 9 లోక్ సభ సీట్లనూ ఆశిస్తోంది టీడీపీ నుంచి.

ఈ నేపథ్యంలో, బీజేపీ గొంతెమ్మ కోర్కెలు తీరేవి కాదు టీడీపీ, జనసేన వద్ద. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలూ, బీజేపీని సైడ్ చేసేశాయ్. ఇంతలోనే, వామపక్షాలు రంగంలోకి దిగాయి. చెరో ఎంపీ సీటునీ వామపక్షాలు అడిగే అవకాశం వుందిగానీ, వాటికి అంత సీన్ లేదు.

ఇక, అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే, చెరో రెండు సీట్లు ఇస్తే సరిపోతుందన్నది వామపక్షాల విషయమై టీడీపీ భావన. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇంకోసారి ఈ వామపక్షాల ప్రతిపాదనపై సమాలోచనలు జరిపాకే.. తదుపరి నిర్ణయాలు వుండే అవకాశం కనిపిస్తోంది.