జైల్లో అల్లుడి ఆవేదన… బయట అత్త ఆనందం!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు 14 రోజుల పాటు రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు జైలు అధికారులు. దీనిపై కూడా ట్రోల్స్ నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడి అత్త లక్ష్మీ పార్వతి స్పందించారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై దివంగత నేత ఎన్టీఆర్ భార్య, చంద్రబాబు అత్తగారైన లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందదని.. చంద్రబాబు అవినీతిపరుడని తన భర్త ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని ఆమె అన్నారు.

ఇదే సమయంలో 73 ఏళ్ల వయసులో వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కొని ఎన్టీఆర్‌ ను మానసిక హింసకు గురి చేసిన చంద్రబాబుకు ఇన్నాళ్లకు తగిన శాస్తి జరిగిందని ఆమె హర్షం వక్తం చేశారు. ఫలితంగా చంద్రబాబు కూడా 73 ఏళ్ల వయసులోనే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆమె సంతోషపడుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్‌ సమాధికి లక్ష్మీపార్వతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా ముందు స్పందించారు. కోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందా అని నిన్న రాతంత్రా నిద్రపట్టలేదని చెబుతు… చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు.

ఇదే క్రమంలో… ఈ క్షణం కోసమే తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ నయ వంచకులు తన భర్త చావుకు కారణమయ్యారని మండిపడుతూ… ఎట్టకేలకు తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నానని స్పష్టం చేశారు.

కాగా చంద్రబాబు.. తిరుగుబాటు చేసి పార్టీని లాక్కుని, ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 1995 జనవరి 18న ఎన్టీఆర్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత “ఎన్టీఆర్‌ టీడీపీ” పేరుతో పార్టీ నడిపిన లక్ష్మీపార్వతి ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీని ఎత్తేశారు. ఆ తర్వాత చాలాకాలం రాజకీయాలకు దూరమైన ఆమె అనంతరం వైసీపీలో చేరారు. ప్రస్తుతం పీ తెలుగు – సంస్కృత అకాడమీ చైర్‌ పర్సన్‌ గా పనిచేస్తున్నారు.