వైనాట్ 175 అని జగన్ ఏ క్షాణన్న అనుకున్నారో కానీ.. రిజల్ట్ సంగతి దేవుడెరుగు కానీ.. వ్యూహాలు మాత్రం ఒక రేంజ్ లో పన్నుతున్నారన్ని అంటున్నారు పరిశీలకులు. ఒకపక్క కుప్పంపై భారీస్థాయిలో శ్రద్ధ పెట్టడం.. మంత్రి పెద్దిరెడ్డి ఇక ఆపనిలోనే ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో ఈసారి హిందూపూర్ ని కూడా కొట్టాలని ఫిక్సయ్యారంట జగన్.
రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అటు పవన్, ఇటు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ మొదలైన నేతలను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని వైసీపీ బలంగా ఫిక్సయ్యిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా హిందూపురం నియోజకవర్గంపై జగన్ ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టారని అందులో భాగంగా అన్నగారి భార్యను అక్కడనుంచి పోటీ చేయించాలని ఫిక్సయ్యారంట!
అవును… అన్న ఎన్టీఆర్ సతీమణి.. ప్రస్తుతం ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ గా ఉన్న లక్ష్మీ పార్వతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. పదవులతో సంబంధం లేకుండా ఆమె పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడం.. అన్నగారి సతీమణిగా గౌరవం ఉండడంతో ఇప్పుడు రాజకీయంగా ఆమె పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఇదే సమయంలో గతంలో ఎన్టీఆర్ గెలిచిన స్థానంలో ఏ ఒక్కచోటనుంచైనా పోటీచేసి, ఆ స్థానాన్ని దక్కించుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేది ఆమె చిరకాలం వాంఛ అని అంటున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తన కోరికను సీఎం జగన్ దగ్గర ప్రస్తావిస్తున్నారట. దీంతో ఇప్పుడు.. ఈసారి ఆమె కోరికను జగన్ మన్నిస్తారని.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీకి, అటు నందమూరి కుటుంబానికీ హిందూపూర్ నియోజకవర్గం ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి అన్నగారు విజయం దక్కించుకున్నారు. ఇదే సమాయంలో గత రెండు ఎన్నికల్లో అన్నగారి కుమారుడు బాలయ్య విజయం దక్కించుకుంటున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అన్నాగారి భర్య, శ్రీమతి లక్ష్మీపార్వతీ ఎన్టీఆర్ పోటీచేయబోతున్నారని అంటున్నారు.
ఇదే జరిగితే బాలయ్యకు భారీ కాంపిటీషన్ తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… బాబు భజన చేసే కొంతమందికి లక్ష్మీపార్వతి నచ్చకపోవచ్చుకానీ… అన్నగారిని అభిమానించేవారిలో మెజారిటీ జనం ఆమెపై కూడా అభిమానం చూపిస్తుంటారని అంటుంటారు. ఫలితంగా… హిందూపుర్ లో ఆమె వైసీపీ నుంచి పోటీచేస్తే గెలవడం తధ్యం అని చెబుతున్నారు.
కాగా… 2014, 2019 ఎన్నికల్లో హిందూపుర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాలకృష్ణ వరుసగా 16,196.. 17,028 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. అయితే ఇదేమీ గొప్ప మెజారిటీ కాదని.. లక్ష్మీపార్వతి లాంటి వ్యక్తి పోటీచేస్తే కొట్టడం పెద్ద విషయం కాదని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా… ఈ పోటీ జరిగితే రాబోయే ఎన్నికల్లో వన్ ఆఫ్ ది హాట్ టాపిక్ అసెంబ్లీ నియోజకవర్గం అవుతుందనడంలో సందేహం లేదు!