కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ తరపున కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ఎంపీలు లేరు. అలాగే రాజ్యసభలో ఉన్న ఎంపీలలో కేవీపీ రామచంద్రరావే ఏపీ గొంతుక వినిపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతున్నాడు. కాంగ్రెస్ తరపున పోరాడుతున్నాడు. దీంతో ఆయనే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారాడు. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతానని కేవీపీ అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీనే దానిని అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలోనూ దీనిపై చాలా స్పష్టంగా రాహుల్, సోనియాగాంధీలు చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రస్తుత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి సిగ్గులేకుండా తప్పించుకుందని, యూపీఏ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదానిస్తుందని కేవీపీ అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని రాజ్యసభలో డిమాండ్ చేస్తామని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ప్రత్యేక హోదా మరిచిపోమన్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో కూర్చొని ప్రత్యేక హోదాను చూస్తారని ఎద్దేవా చేశారు.