ప్రియ తాజా మాట… నారాయణ పూర్తిగా ఇరుక్కున్నట్లేనా?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లుగా అయ్యింది నారాయణ పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో పరోక్షంగా టీడీపీ, జనసేనలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. నారాయణ సోదరుడి భార్య ఆరోపణల విషయంలో టీడీపీ, జనసేన అనుసరిస్తోన్న వ్యూహాత్మక మౌనం పెద్ద నష్టమే తెచ్చేలా ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో కీలక విషయం వెల్లడించారు నారాయణ సోదరుడి సతీమణి ప్రియ. అవును… మాజీ మంత్రి నారాయణ తనను ఎన్ని అవస్థలకు గురి చేశారన్న విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు ప్రియ. దీంతో పెను దుమారమే లేచింది. తన పెళ్లి.. ఆ తర్వాత ఇంట్లో అత్తమామలు ఎలా చూసుకునేవారన్న విషయం దగ్గర నుంచి నారాయణ చేష్టల గురించి ఆమె విపులంగా వివరించారు.

ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. తనపై చేస్తున్న మానసిక పరిస్థ్హితి కి సంబంధించిన వ్యాఖ్యల వేళ.. ప్రియ షాకింగ్ సవాలు విసిరారు. తాను చెప్పిన అంశాలు తప్పు కాదన్న విషయాన్ని రుజువు చేస్తానని.. కావాలంటే తనకు నార్కో టెస్టు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా.. తనతో పాటు నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

దీంతో వ్యవహారం మరింత వేడెక్కింది. నిజంగా నారాయణ నార్కో పరీక్షలకు తాను కూడా సిద్ధం అంటే పరిస్థితి ఏమిటన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ ఛాలెంజ్ పై ఆయన మౌనంగా ఉంటే మాత్రం… ఆయన ఇరుక్కున్నట్లే భావించాలనే అభిప్రాయాలు తెరపైకి వస్తోన్నాయి.

ప్రియ అనారోగ్యంతో ఉందని.. ఆమె మానసికంగా సరిగా లేదని ప్రియ భర్త వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఆమె హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ కు వెళ్లి నారాయణ మీద ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాటర్ మరింత సీరియస్ గా మారింది. అనంతరం పవన్ పై కూడా ఆమె కీలక వ్యాహ్యలు చేశారు.

ఇదే సమయంలో… నారాయణ వైద్యశాలలో చాలామంది మహిళా వైద్యులు మాజీ మంత్రి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారని.. వాటికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా ప్రియ పేర్కొన్నారు. తాను చెప్పిన వాటిల్లో తప్పులు అని తేలితే నారాయణ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరతానని వ్యాఖ్యానించారు. తనతో పాటు నారాయణకు కూడా నార్కో పరీక్షలు నిర్వహించాలని ఆమె పునరుధ్ఘాటించారు!

తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని.. కానీ తనకు సమస్య వస్తే పవన్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన సీఎం అయితే నమ్ముకున్న వారి పరిస్థితేమిటి? అని ప్రశ్నించారు.

ఇలా తాజాగా అటు టీడీపీ, ఇటు జనసేనలకు ప్రియ రూపంలో పెద్ద కష్టమే వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో… నార్కో పరీక్షకు సిద్ధమన్న సవాలుతో నారాయణ వ్యక్తిగతంగా అడ్డంగా ఇరుక్కుపోయినట్లేనని చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రియ ఛాలెంజ్ కు నారాయణ స్పందిస్తారా.. లేక, మౌనాన్నే తన భాషగా చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి.