నిజానికి, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ అంశం. కానీ, అది చాలా చాలా సిల్లీ వ్యవహారమైపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకరి మీద ఇంకొకరు నిఘా పెట్టడం చాలా సులువైపోయింది. అలాంటప్పుడు, ప్రభుత్వాలు ఎంతో తేలిగ్గా నిఘా పెట్టేస్తాయ్ కదా.? ఆ మధ్య దేశాన్ని ఇలాంటిదే ఓ కుంభకోణం ఓ కుదుపు కుదిపేసింది. ఆ తర్వాత అంతా సైలెంటయిపోయారు. ఆ ‘పెగాసస్’ ప్రకంపనల్ని ఎలా మర్చిపోగలం.?
అసలు విషయానికొస్తే, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీ సర్కారుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. సాక్షాత్తూ ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారే తనకు, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పారనీ, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర వున్నాయని మీడియా ముందు వాపోయారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
గత కొంతకాలంగా వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పొగపెడుతున్నారు. మంత్రి పదవి ఆయనకు దక్కాల్సి వుండగా, విస్తరణలో ఆయన పేరుని సీఎం వైఎస్ జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. అయినా, కోటంరెడ్డి సర్దుకుపోయారు. ఇంతలోనే ఏమయ్యిందోగానీ, కోటంరెడ్డి పార్టీ మారతానంటున్నారు. అవమానాలు ఎదురవుతున్న చోట వుండలేమంటూ కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. కేంద్ర హోం శాఖకి కూడా ఫిర్యాదు చేశారట. ఫోన్ ట్యాపింగ్ నిజమేనని సహచర ఎమ్మెల్యేలతోపాటు, మంత్రులు, ఎంపీలు కూడా తనకు చెప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. నిజమేనా ఇదంతా.? లేదంటే, పార్టీ మారే క్రమంలో బురద చల్లిపోతున్నారా.?