నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. పోనీ రేపు ఏ పార్టీలో చేరబోతున్నారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డిని ఏ పార్టీ ఆహ్వానించబోతోంది.. అసలు కోటంరెడ్డి మనసులో ఏముంది.. ఇప్పుడు కోటంరెడ్డి రాజకీయ చౌరస్తాలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది.. అనేవి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కారణం… కోటంరెడ్డి, టీడీపీలోకి వెళ్లడానికి పడుతున్న ప్రాకులాట!
అవును… వైసీపీ నుంచి బయటకొచ్చిన అనంతరం కోటంరెడ్డి పరిస్థితి.. చౌరస్తాలో ఉందని అంటున్నారు విశ్లేషకులు. కారణం… జగన్ ను తిట్టి బయటకు రాగానే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయగానే… బాబు రెడ్ కార్పెట్ పరుస్తారని శ్రీధర్ ఆశించారు! రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తానన్నస్థాయిలో స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు. అయితే చంద్రబాబు సంగతి పూర్తిగా తెలియకో ఏమో కానీ… ఆయన దగ్గర మాట తీసుకోకుండానే వైసీపీ గడప దాడేశారు.
ఇలా ఏ పార్టీకీ చెందకుండా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ట్యాగ్ తో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలో అరెస్టయిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ఫలితంగా… తాను టీడీపీ మనిషిగా ఉండాలనుకుంటున్నట్లు కోటంరెడ్డి పడుతున్న ప్రాకులాట మామూలుగా లేదనే కామెంట్లు మొదలైపోయాయి!
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కోటంరెడ్డి చెప్పిన సమాధానాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కోటంరెడ్డి ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి!
టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని అడిగితే.. కోటంరెడ్డి దగ్గర సమాధానం లేకపోవడంపై ఆయన అభిమానులు షాకవుతున్నారు. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం… వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం మాత్రం ఖాయమని. అదేముంది ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయొచ్చు కదా..! ఇక ఈ నెలాఖరులో రాజమండ్రిలో జరగబోతున్న టీడీపీ మహానాడులో సైతం తాను పాల్గొనటంలేదని స్పష్టం చేశారు శ్రీధర్. అంటే… టీడీపీ మహానాడులో పాల్గొనక, టీడీపీలో ఎప్పుడు చేరుతారనే విషయానికి సమాధానం చెప్పకపోవటంతో… ప్రస్తుతం కోటంరెడ్డి పరిస్థితి పొలిటికల్ జంక్షన్ కు చేరుకుందని అంటున్నారు విశ్లేషకులు.
పైగా కోటంరెడ్డిని టీడీపీలోకి చేర్చుకునే విషయంలో పార్టీలో బాగా వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. కోటంరెడ్డి రాకను టీడీపీ నేతలు, మరిముఖ్యంగా నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఏమత్రం ఆహ్వానించలేపోతున్నారంట. దీనికితోడు… కోటంరెడ్డి.. వైఎస్ జగన్ కోవర్టుగా టీడీపీలోకి వస్తున్నారా అనే ప్రచారం కూడా ఒకపక్క నడుస్తుంది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో బాబు సెకండ్ థాట్ కి వెళ్లారని.. ఫలితంగా కోటంరెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవటిలా మారిందని అంటున్నారు విశ్లేషకులు!