కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీకి కొత్త తలనొప్పి.!

Kotamreddy

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య విషయమై కోటంరెడ్డి ఏకంగా నిరసనకు దిగారు.. అదీ ఆ డ్రైనేజీలో.. మోకాళ్ళ లోలుతో నిల్చుని నిరసన తెలపడం గమనార్హం.

వాస్తవానికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వున్నప్పుడు, అప్పటి అధికార పక్షం తెలుగుదేశం పార్టీపై ఇలాగే నిరసనలు చేశారు. ఇప్పుడు వైసీపీనే అధికారంలో వుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి వుండీ, నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించలేకపోవడమేంటి.?

అధికారులు తమకు సహకరించడంలేదనీ, ప్రజల్ని పట్టించుకోవడంలేదనీ స్వయానా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఒకింత గుస్సా అవుతోంది. ‘విపక్షాలంటే శతృవులు కాదు.. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. వారి పట్ల శతృత్వం మంచిది కాదు..’ అంటూ ఈ మధ్యనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ ప్రభుత్వానికీ, తమ పార్టీ అధిష్టానానికీ చురకలంటించిన సంగతి తెలిసిందే.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఒకరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. మంత్రి పదవి దక్కకపోవడంతో మీడియా ముందే బోరున విలపించారు ఇటీవల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

అప్పటినుంచి కోటంరెడ్డిలో కొత్త మార్పు వచ్చిందన్నది వైసీపీ వాదన. నిజానికి, తన నియోజకవర్గంలో అమరావతి రైతులు పాదయాత్ర, వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికీ ఆయన ప్రయత్నించి అధిష్టానం ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.