మాజీ మంత్రి కొండా సురేఖ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారట. అదీ వైసీపీని ఓడించేందుకోసమట. ఇంతకీ, ఆమె ఇప్పుడు ఏ పార్టీలో వున్నట్టు.? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు. ముందు ముందు ఏ పార్టీలోకి వెళతారో తెలియదు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనే డిమాండ్‌తో కొండా సురేఖ అప్పట్లో మంత్రి పదవిని వదులుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన కొండా సురేఖ, రెబల్ పొలిటీషియన్. కానీ, ఆ డైనమిక్ రెబలిజం.. ఆ తర్వాత నీరుగారిపోయింది.
పార్టీలు మారుతూ.. మారుతూ.. తమ ఉనికిని కోల్పోయారు. చివరికి తమ బయోపిక్‌ని రామ్ గోపాల్ వర్మ ద్వారా తీయించుకుని.. దాంతోనూ, చేతులు కాల్చుకున్నారు ఆర్థికంగా. ఆర్జీవీ సినిమా అంటే, వైసీపీకి అనుబంధమే కదా.! మరెందుకు వైసీపీతో కొండా సురేఖకు బెడిసి కొట్టినట్లు.?
నిజానికి, తెలంగాణలో వైఎస్ షర్మిలకు కొండా దంపతులు రాజకీయంగా మద్దతునిచ్చి వుండాలి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఏమాత్రం అభిమానం వున్నా. కానీ, అలా చేయలేదామె.!
గతంలో వైఎస్ జగన్ వెంట నడిచినా, ఇప్పుడు వైఎస్ జగన్ అంటే అస్సలు నచ్చడంలేదు కొండా దంపతులకి. పోనీ, తెలంగాణలో రాజకీయాలతో సరిపెడతారా.? అంటే అదీ లేదు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారట.
నమ్మేదెవడు.? అసలు కొండా దంపతుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టించుకునేదెవరు.? ఇదంతా ఓ హంబక్ వ్యవహారం అంతే.!