వైసిపి ఎంఎల్ఏ కోన రఘుపతి అసెంబ్లీ డిప్యుటి స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో కోన గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నుండి వరుసగా రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోనను డిప్యుటి స్పీకర్ ను చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించగానే ఎంపిక ఏకగ్రీవం అయిపోయింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పీకర్ ఎంపిక సమయంలో జరిగిన రచ్చ డిప్యుటి స్పీకర్ ఎంపిక విషయంలో జరగకపోవటం. స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా తమ్మినేనిని కూర్చోబెట్టే సమయంలో సభాపతిగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాత్రమే కుర్చీ దగ్గరకు వచ్చారు.
సభలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు మత్రం రాలేదు. పైగా తాను రాకుండా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పంపారు. దాంతో సభలోనే పెద్ద వివాదం రేగింది. సంప్రదాయాలు పాటించలేదని, స్పీకర్ ఎంపిక విషయంలో తమకు సమాచారం ఇవ్వలేదని టిడిపి బుకాయించింది. అయితే అదంతా బుకాయింపేనని ప్రోటెమ్ స్పీకర్ సంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు ప్రకటనతో తేలిపోయింది.
అందుకనే తాజాగా డిప్యుటి స్పీకర్ గా కోన రఘుపతి ఎంపిక విషయంలో చంద్రబాబు కూడా కలసివచ్చారు. కోనను కుర్చీలో కూర్చోబెట్టే సమయంలో జగన్ అండ్ కో తో పాటు చంద్రబాబు అండ్ కో కూడా కుర్చీ దగ్గరకు వచ్చారు. మొత్తానికి స్పీకర్ విషయంలో చేసిన తప్పును డిప్యుటి స్పీకర్ విషయంలో దిద్దుకున్నట్లైంది.