కాంగ్రెస్ ఓటమికి అదే కారణం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంపికను సమర్ధిస్తున్నానని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…

“రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం  సీఎల్పీ నాయకుడి ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించాము. రాహుల్ గాంధీ గారు భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. భట్టి విక్రమార్కకు విప్ గా, డిప్యూటి స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో భట్టి విక్రమార్క నియామకం సరైనది. పదవి కావాలని ఆశ పడడంలో తప్పులేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం.

అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవడం నష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్టు నడిచాయి. ఎన్నికల్లో ఓటమికి ఒక్కరిని బాధ్యున్ని చేయడం సరికాదు. సీట్ల కేటాయింపులో ఆలస్యం కూడా ఓటమికి ఒక కారణం. అధిష్టానం కొంత ముందుగా సీట్ల కేటాయింపు చేస్తే బాగుండేది. సీట్ల కేటాయింపులో కొన్ని లోపాలు జరిగాయి. పార్లమెంటు ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందా లేదా అనేది రాహూల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు.

 అలాగే పిసిసి మార్పు కూడా అధిష్టానం తీసుకోవాల్సిందే. మా పరిధిలో లేదు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారే ఆలోచనలో లేరు. ప్రజల సమస్యల కోసం కొట్లాడుతాం. పార్టీ మార్పు సమస్యకు పరిష్కారం కాదు. ప్రజల తరపున మాట్లాడే అవకాశం దక్కింది. దానిని సద్వినియోగం చేసుకుంటాం.  ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న వార్తలు నమ్మవద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం.” అని ఆయన అన్నారు.

నిన్న మొన్నటి వరకు సీఎల్పీ కావాలని డిమాండ్ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ ఎంపికను సమర్ధించడం అందరిని ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ పార్టీలో అసలే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని భావించిన స్థానిక నాయకత్వం ముందు జాగ్రత్త చర్యగా సీఎల్పీ ఎంపిక బాధ్యతను  అధిష్టానం చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీనే ఫైనల్ చేయడంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడకుండా రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. భవిష్యత్తులో ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోమోనన్న చర్చ జరుగుతోంది.