ఎన్నికల్లో గెలిచాక వైసీపీ ఎమ్మెల్యేల్లో పొడచూసిన మొదటి అసంతృప్తి మంత్రి పదవులు దక్కకపోవడం. చాలామంది సీనియర్లు, భారీ మెజారిటీతో గెలిచిన నేతలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజికవర్గ సమీకరణాలు, జగన్ స్ట్రాటజీలతో పదవి ద్కకుతుందనే నమ్మకం పెట్టుకున్న చాలామంది చివరి నిముషంలో నిరాశకు గురయ్యారు. కానీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు జగన్ రెండున్నరేళ్ల తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పడంతో అసంతృప్తులంతా శాంతించారు. ఇంకొద్ది నెలల్లో జగన్ చెప్పిన మార్పులు, చేర్పులు జరగనున్నాయి. దీంతో పదవి దక్కని వాళ్లంతా పైరవీలు స్టార్ట్ చేశారు. అలాంటి వారిలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడ ఒకరు.
పెనమలూరు నియోజకవర్గం నుండి గెలుపొందిన ఈయన యాదవ సామాజికవర్గానికి చెందినవారు. మంచి పట్టున్న నేత. చివరి నిముషంలో జగన్ అనిల్ కుమార్ యాదవ్ వైపు మొగ్గుచూపడంతో పదవి దక్కించుకోలేకపోయారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి దూరం జరిగారు. నియోజకవర్గానికే పరిమితమయ్యారు తప్ప జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానేశారు. అధినేత ఇచ్చిన ఏ పిలుపునూ అందుకోలేకపోయారు. గతంలో కేబినెట్ మంత్రిగా చేసి ఉండటంతో మంత్రి పదవిని ప్రిస్టేజ్ ఇష్యుగా భావించి ఈగోకి వెళ్లారు. దీన్ని గమనించిన జగన్ విప్ పదవి ఆఫర్ చేసినా కాదన్నారు. చివరికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడంతో కొంత శాంతించారు.
ఆ పదవి తర్వాత పార్టీలో కొద్దిగా యాక్టివ్ అయినా ఈయన మళ్ళీ ఇప్పుడు పాత పాటే పాడుతున్నారట. రెండున్నరేళ్ల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు అనిల్ కుమార్ ను పక్కనపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రేండేళ్ల పాలనలో పార్టీ తరపున ఆబాలనగా వాయిస్ వినిపించిన నేతల్లో అనిల్ ముందున్నారు. పోలవరం బాధ్యతలను సమర్థవంతంగా చూసుకుంటున్నారు. ఆయన ఉంటేనే పోలవరం పనులు సక్రమంగా జరుగుతాయని భావిస్తున్న జగన్ మంత్రివర్గంలో కొనసాగించాలని డిసైడ్ అయ్యారట. దాంతో యాదవ వర్గానికి చెందిన పార్థసారథికి పదవి దక్కడం కష్టమైంది.
ఇక కృష్ణా జిల్లాకే చెందిన మరొక బీసీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు పదవి దక్కే ఆస్కారం కనిపిస్తోంది. ఇది పార్థసారథికి మరింత అసహనాన్ని తెప్పిస్తోంది. కూర్చున్న తన సంగతి చూడకుండా వేరొకరికి పదవిని ఇవ్వబోతున్నారని అసంతృప్తితో ఉన్నారు. అందుకే గతంలో మాదిరిగానే పార్టీకి, అధిష్టానానికి దూరం జరుగుతున్నారట. అయితే ఈ దూరం పార్టీలో ఆయన స్థానాన్ని మారినట్టు దిగజార్చుతోందని, పదవి పొందడానికి ఉన్న కొద్దిపాటి అవకాశాన్ని కూడ కోల్పోతున్నారని, పరిస్థితి ఎలాంటిదైనా అధినేతకు అనుకూలంగా ఉండి, దగ్గరైతేనే కదా ఏదో ఒక మంచి జరిగేదని అభిప్రాయపడుతున్నారు పార్టీ శ్రేణులు.