రాజుల మీదే గెలిచాడు.. పాపం బొత్స ముందు తేలిపోతున్నాడు !

 Kolagatal Veerabhadra Swamy unhappy with Botsa Satyanarayana
బొత్స సత్యనారాయణ.. ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానాన్ని  తిప్పుకోవడంలో మహాదిట్ట.  కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఈయన ఇప్పుడు వైసీపీలో మంత్రిగా ఉన్నారు.  చీపురుపల్లి నుండి వరుస విజయాలను సాధిస్తున్న ఆయన విజయనగరం జిల్లా మీద పూర్తి పట్టును సాధించారు.  పార్టీ ఏదైనా జిల్లాలో ఆయన మాటే చెల్లుబడి కావాలి.  జూనియర్ నేతల నుండి సీనియర్ నేతలు వరకు అందరూ ఆయన కనుసన్నల్లోనే ఉండాలి.  టికెట్ల దగ్గర నుండి పదవుల వరకు ప్రతిదీ ఆయన నిర్ణయం మేరకే  జరగాలి.  జగన్ సైతం విజయనగరం జిల్లాను బొత్సకే వదిలేశారు.  దీంతో బొత్స అనుచర వర్గం దూసుకుపోతుంటే బొత్సతో సమానమైన సీనియర్ లీడర్ కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం తేలిపోతున్నారు. 
 
 Kolagatal Veerabhadra Swamy unhappy with Botsa Satyanarayana
Kolagatal Veerabhadra Swamy unhappy with Botsa Satyanarayana
విజయనగరం రాజకీయాల్లో బొత్స, కోలగట్ల ఇద్దరూ సమానమైన సీనియారిటీ కలిగిన  నేతలే.  కానీ నిత్యం బొత్స డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది.  బొత్స ఎప్పటికప్పుడు కోలగట్లను నిలువరించాలని చూస్తున్నారు.  2004లో స్వాతంత్య్ర అభ్యర్థిగా విజయనగరం రాజు అశోక్ గజపతిరాజు మీద విలయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కోలగట్ల కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న సమయంలో బొత్స అడ్డుతగిలారు.  విజయనగరం అంటే తన పేరే వినబడేలా చేసుకున్నారు.  బొత్స ఉన్న చోట ఎదగడం కష్టమని భావించిన కోలగట్ల ఆ తర్వాత వైసీపీలో చేరారు.  జిల్లాలో పార్టీ పునాదులు వేయడంలో కీ రోల్ ప్లే చేశారు.  కానీ 2014లో ఓడిపోయారు.  అయినా జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు.  
 
ఇక బొత్స వైసీపీలోకి ప్రవేయిసంచడంతో సీన్ మళ్ళీ మొదటికే వచ్చింది.  కోలగట్ల హవాకు అడ్డుపడింది.  2019 ఎన్నికల్లో గెలిచినా సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.  బొత్స మంత్రి అయ్యారు.  దీంతో  నిరుత్సాహపడిన ఆయన త్వరలో జగన్ ఏర్పాటుచేయనున్న ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు.  అభివృద్ధి మండలి చైర్మన్ అంటే కేబినెట్ ర్యాంక్  కలిగిన హోదా అయ్యే అవకాశం ఉంది.  అంటే మంత్రివర్గంలోని మంత్రికి అందిన మర్యాదలే అభివృద్ధి మండలి చైర్మన్ కు కూడ ఉంటాయన్నమాట.    విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ప్రత్యేక జోన్లను ఏర్పాటుచేసి అభివృద్ధి మండళ్లను ఏర్పాటుచేస్తారు.  వీటిలో ఉత్తరాంధ్ర బోర్డ్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు కోలగట్ల. 
 
కానీ బొత్స ఆయన ఆశలను ఆవిరి చేసేలా ఉన్నారు.  టీడీపీ మహిళా నేత మీసాల గీతను పార్టీలోకి తీసుకురావాలని బొత్స గట్టిగా ట్రై చేస్తున్నారు.  విజయనగరంలో  ఎక్కువగా ఉండే తూర్పు కాపుల వర్గానికి చెందినవారు మీసాల గీత.  2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె గత ఎన్నికలో టికెట్ దక్కక టీడీపీ మీద అసంతృప్తితో ఉన్నారు.  ఆమెను పార్టీలోకి తీసుకొచ్చి మండలి  చైర్మన్ పదవి కట్టబెట్టి విజయనగరంలో కోలగట్లకు చెక్ పెట్టాలని బొత్స భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  బొత్స గట్టిగా ప్రయత్నిస్తే అది జరగవచ్చు కూడ.  ఈ పరిణామమే ఆయన్ను నిరుత్సాహానికి గురిచేస్తోంది.