వైసీపీ కొంప ముంచుతున్న కొడాలి అత్యుత్సాహం.!

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. మీడియా ముందుకొస్తే.. అసలేం మాట్లాడుతున్నారన్నదానిపై కనీస సోయ ఆయనకు వుంటుందా.? వుండదా.? అన్న డౌట్ మీడియా ప్రతినిథులకు రావడం కొత్తేమీ కాదు. చంద్రబాబుని విమర్శించే క్రమంలో, లోకేష్‌ని తూలనాడే క్రమంలో హద్దూ అదుపూ ఏమీ వుండవు కొడాలి నానికి.

కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి, ‘రాజకీయాల్లో సభ్యత, సంస్కారం అవసరం’ అని చెబుతుంటారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి హోదాలో అధికారిక వేదికలపైనే, ‘రాజకీయాల్లో సభ్యత వుండాలి..’ అంటూ క్లాసులు తీసుకుంటుంటారు. సరే, ఆ సభ్యత.. సంస్కారం.. వ్యవహారాల్ని పక్కన పెడితే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంపై కొడాలి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

‘వైఎస్ వివేకానందరెడ్డి బతికి వున్నా, చచ్చిపోయినా.. కడప ఎంపీ టిక్కెట్ అవినాష్ రెడ్డికే వస్తుంది.. ఎందుకంటే, అవినాష్ రెడ్డి కుటుంబం వైసీపీ పెట్టినప్పటినుంచీ వైఎస్ జగన్ వెంటే వుంది..’ అని లాజిక్ చెప్పారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి ఏం చేశారు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు. వైఎస్ విజయమ్మపై పులివెందులలో పోటీకి దిగారు..’ అంటూ కొడాలి నాని కాస్త గతి తప్పిన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, కొడాలి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని వాస్తవాలూ లేకపోలేదు.

బొత్స సత్యనారాయణ సహా, ప్రస్తుత వైసీపీ నేతలు చాలామంది గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూలనాడిన విషయం విదితమే. మరి, వాళ్ళందరికీ టిక్కెట్లు దక్కాయ్ కదా.? మొత్తమ్మీద, కొడాలి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పైగా, ‘అందుకే బాబాయ్ వైఎస్ వివేకాని చంపించేశారా..’ అనే ప్రశ్నల్నీ వైసీపీ ఎదుర్కొవాల్సి వస్తోంది.. కొడాలి కారణంగా.