ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపగలిగే స్థాయిలో చిరంజీవి అభిమానులుంటారా.? అదే నిజమైతే, 2008 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చేది కదా.? మరీ, అంత తక్కువగా చూడలేం.! ఎందుకంటే, చిరంజీవి దాదాపు 70 లక్షల ఓట్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా గెలుచుకున్నారు.
కానీ, ఆ చిరంజీవి ప్రభావం, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించలేదు. కనిపించి వుంటే, జనసేన పార్టీకి ఖచ్చితంగా ఓ డజను అసెంబ్లీ సీట్లు అయినా వచ్చి వుండేవి.! జనసేన పార్టీని కాదని, వైసీపీకి చిరంజీవి అభిమానులు ఓట్లేశారా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.
2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? వైసీపీ భయం చూస్తోంటే, ఈసారి చిరంజీవి అభిమానులు గంపగుత్తగా జనసేన పార్టీకి ఓట్లేస్తారేమో అన్న భయం ఆ పార్టీలో వున్నట్లే కనిపిస్తోంది.
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ‘చిరంజీవిని తిడితే, రాజకీయంగా ఏం జరుగుతుందో మాకు తెలియదా.? మేమెందుకు ఆయన్ని విమర్శిస్తాం.?’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మొన్నామధ్య, ‘పకోడీగాళ్ళు’ అంటూ చిరంజీవి మీదనే కొడాలి నాని సెటైర్లేశారు. ఇప్పుడేమో, తాను చిరంజీవిని అలా అనలేదంటున్నారాయన. కొడాలి నాని జాగ్రత్త పడ్డారు.! కాదు కాదు, భయపడ్డారు.! మరి, పేర్ని నాని పరిస్థితేంటి.? అంబటి రాంబాబు సంగతో.! రోజా తదితరులేమంటారో.!