వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా సొంత పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ప్రతిఒక్కరితోనూ వ్యక్తిగతంగా టచ్లో ఉండేవారు. కానీ సీఎం అయ్యాక.. కనీసం ముఖం చూపించే టైం కూడ లేకుండాపోయింది ఆయనకు. పాలనలో బాగా బిజీ అయిపోవడంతో చుట్టూ ఉన్న ఏడెనిమిది మంది మంత్రులతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడట్లేదు. కనీసం పూర్తిగా 151 మంది ఎమ్మెల్యేలను ఈనాటికి కలవలేకున్నారు ఆయన. ఇదే చాలామంది నాయకులకు నచ్చట్లేదు. జగన్ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. కనీసం ఒక్కసారి కూడ కలిసే అవకాశం ఇవ్వకపోతే తమ కష్టాలను చెప్పుకొనేది, సమస్యలను తీర్చుకునేది ఎప్పుడని వాపోతున్నారు. కొందరైతే బాహాటంగానే ఓపెన్ అయిపోయారు.
నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి సైతం అధినేతను కలవాలని చాలా ట్రై చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్ తనపై చూపిన అభిమానంతో భవిష్యత్తును వేరే లెవల్లో ఊహించుకున్నాడు బైరెడ్డి. ఇప్పటికీ బైరెడ్డి అంటే జగన్ కు ఇష్టమే. కానీ బిజీ షెడ్యూల్ వలన కలిసే వీలు ఇవ్వలేకపోతున్నారు. నందికొట్కూరులోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధినేతను కలవడం బైరెడ్డికి అత్యవసరం. జగన్ అపాయింట్మెంట్ కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు ఆయన. ఈ అసంతృప్తిని బైరెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా ఎక్కడా బయటపెట్టలేదు కానీ తాజాగా గుడివాడలో చెప్పేశారు.
గుడివాలో జరుగుతున్న సంక్రాతి సంబరాలకు మంత్రి కొడాలి నాని బైరెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన బైరెడ్డి మీడియా ముందు కొడాలి నాని అన్నయ్యే తనకు ఆదర్శమని, ఆయనలా ఎదగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. నానిని ఆకాశానికెత్తే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉన్నా జగన్ ప్రస్తావన తెచ్చి రౌండప్ అయ్యారు. నాని అన్న అప్పుడప్పుడు మా నందికొట్కూరు వైపు కూడ చూసి మాకు సహాయం, సహకారం అందివ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే జగనన్న మాకెప్పుడూ అందుబాటులో ఉండడు. అలాంటప్పుడు మీలాంటివారి సహకారం అవసరం. అందుకే మా దిక్కు కూడ చూస్తూండండి అన్నారు. బైరెడ్డి జగనన్న అందుబాటులో ఉండడనే మాటను ఏదో యథాలాపంగా అన్నప్పటికీ అది వాస్తవం కాబట్టే బయటికొచ్చినట్టుగా ఉంది. సిద్దార్థరెడ్డి నోటి వెంట ఆ మాట వినేసరికి పక్కనే ఉన్న నాని సైతం ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనై బైరెడ్డి వైపు చూడటం ఇక్కడ కొసమెరుపు. మరి నానియే షాకయ్యారంటే ఇవి జగన్ చెవి వరకు వెళితే ఆయన ఎలా ఫీలవుతారో.