ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలంసాహ్న లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు.
మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలని హితవు పలికారు. ఒకవైపు కోవిడ్ కేసుల తీవ్రత ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ అని సెటైర్ వేశారు. జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.