కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్ఠీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుండి 2009 వరకు మధ్యలో ఒక్కసారి మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ పసుపు జెండానే రెపరెపలాడింది. ఆ జెండా కిందే కొడాలి నాని రాజకీయ జీవితం మొదలైంది. తెలుగుదేశం అండతో, నందమూరి కుటుంబం చలవతో నాని బలమైన వ్యక్తిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఎదిగే క్రమంలో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు. 2004 నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీని వీడి వైసీపీలో చేరిన ఆయన 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి కూడ అయ్యారు. గుడివాడలో నానిని కదిలించాలి అంటే అసాధ్యం అనే స్థాయికి చేరుకున్నారు.
కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. గత ఏడెనిమిది నెలల కాలంలో గుడివాడ జనంలో నాని మీద కాస్తంత వ్యతిరేకత మొదలైంది. అందుకు కారణం ఆయన దూకుడే. ఒకప్పుడు ఆయనలో ఏ దూకుడైతే చూసి గుడివాడ జనం ముచ్చటపడ్డారో ఇప్పడు అదే దూకుడును చూసి ఒకింత ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ మారారు కాబట్టి చంద్రబాబును విమర్శించడంలో తప్పు లేదు. పార్టీ మారిన ప్రతిఒక్కరూ అది అందరూ చేసేదే. కానీ నాని విమర్శిస్తున్న తీరు మరీ వ్యక్తిగతమైపోయింది. బాబు ఊసెత్తితే బూతులే తప్ప ఇంకొకటి రావు. లోకేష్ మొదలుకుని చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు వరకు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు నాని. ఈమధ్య బాలయ్యను కూడ వెటకారం చేసేశారు.
తెలుగుదేశాన్ని వీడినా నాని బంపర్ మెజారిటీతో గెలవడానికి కారణం నందమూరి అభిమానులే. నానితో పాటే వారు కూడ టీడీపీకి దూరం జరిగారు. అయిష్టంగానే నానికి జైకొట్టారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాలయ్యను నాని పూచికపుల్లలా తీసేశారు. ఎప్పుడూ లేనిది బాలయ్య కూడ నాని మీద ఫైర్ అయ్యారు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా నాలుగు కాళ్ళ మీద నడుస్తుందా అంటే లేదు. ఈమధ్య బయటపడిన పేకాట స్థావరాలు లాంటివి నానిని ఇబ్బందుల్లోకి నెట్టేవే. ఇవన్నీ కలిసి క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయట. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. గుడివాడలో వైసీపీది పైచేయి అయినా అది మరీ టీడీపీని పాతాళానికి తొక్కేలా ఉండదని, స్థానిక ఎన్నికల్లో టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.