ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరుగా ఎదురుదాడి మొదలుపెడుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి స్ధానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేయగా.. ఇవాళ మరో మంత్రి కొడాలి నాని కూడా నిమ్మగడ్డ ప్రయత్నాలపై విరుచుకుపడ్డారు. ఆయన చెప్పిందే వేదమా, మాకు ప్రజలే ముఖ్యమని తేల్చిచెప్పారు. బీహార్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఏపీలోనూ జరగాలని కోరుకోవడం సరికాదన్నారు.
ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అసహనం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కొడాలి మండిపడ్డారు. కరోనా వేళ స్ధానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నలు సరైన చర్య కాదన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలంపైనా కొడాలి నాని స్పందించారు. నిమ్మగడ్డ మరికొన్ని నెలలు మాత్రమే పదవిలో ఉంటారని, ఆ తర్వాత రిటైరై హైదరాబాద్ వెళ్లిపోతారని కొడాలి అన్నారు. ఆలోపు నేను చెప్పిందే జరగాలని కోరుకోవడం సరికాదన్నారు. నేను చెప్పిందే రాజ్యాంగం అన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహరించడం కుదరదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని, అలా కాకుడా ఎన్నికల సంఘమే నిర్వహిస్తానంటే కుదరని పని అని కొడాలి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువ మందిని తరలించడం సాధ్యం కాదన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని, కరోనా వల్ల ఎవరూ వచ్చే పరిస్ధితి లేదని మంత్రి కొడాలి తెలిపారు. ఈవీఎం కానీ బ్యాలెట్ పేపర్ కానీ ఏది వాడినా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోక తప్పదన్నారు. పోలింగ్ బూత్‌లు కూడా పెంచాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వానికి ప్రస్తుతం స్ధానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదన్నారు. నవంబర్, డిసెంబర్లో మరో విడత వైరస్ వ్యాప్తి అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు వస్తున్నాయని మంత్రి కొడాలి గుర్తుచేశారు. బీహార్ ఎన్నికలతో ఏపీలో స్ధానిక ఎన్నికలను పోల్చకూడదని, అక్కడ కూడా తప్పనిసరి కాబట్టి నిర్వహిస్తున్నారని కొడాలి నాని తెలిపారు.