కొత్తగా కాషాయకండువా కప్పుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి… ఏపీ జనాల చెవుల్లో కమళపూలు పెట్టాలనేపనికి పూనుకున్నారు. ఇలా బీజేపీలో చేరారో లేదో.. వెంటనే ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం బ్రహ్మాండంగా అందుతోందని మొదలుపెట్టేశారు. ఏపీపై కేంద్రం తెగ ప్రేమ చూపించేస్తుంది.. అడగకుండానే వరాలిచేస్తుంది.. ఫైనల్ గా ఏపీకి అద్భుతమైన సహకారాన్ని నరేంద్రమోడీ సారధ్యంలోని కేంద్రప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకొస్తున్నారు నల్లారి వారు!
అవును… ఏపీ అభివృద్ధికి కేంద్రం బ్రహ్మాండంగా సహకరిస్తుందంట. మరి అంత బ్రహ్మాండంగా ఏం సహకరిస్తోందో నల్లారి వారే చెప్పాలి. ఒకవైపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోందని జనాలు గగ్గోలు పెడుతున్నారు. జనాలు గగ్గోలు పెట్టడం కాదు.. ఇప్పటివరకూ ఏయే ప్రయోజనాలను తుంగలో తొక్కేశారన్న విషయం కళ్ళముందు క్లియర్ గా కనబడుతోంది. అందుకే ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా… బీజేపీ ఉందన్న విషయం కూడా జనాలు పట్టించుకోకుండా.. నోటా కంటే కిందకు నెట్టేశారు.
ఈ విషయాలు కొత్తగా కమళం పువ్వందుకున్న కిరణ్ కు కనిపించడంలేదో ఏమో తెలియదు కానీ… మోడీ ప్రభుత్వం మీద ఏపీ జనాలకున్న కసిని రాబోయే ఎన్నికల్లో కూడా మరింత క్లియర్ గా కిరణ్ చూడొచ్చు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. అనంతరం జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఎందులోనూ డిపాజిట్లు దక్కలేదు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లోనూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనుచూపుమేరలో కనిపించకుండా ఏపీ జనాలు తరిమేస్తున్నారు.
అందుకు ప్రధానమైన కారణాలు… విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడవడం, చంద్రబాబుతో కలిసి హోదాను ప్యాకేజీగా మాయచేయడం, రైల్వే జోన్ సాధ్యం కాదనడం, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల నిధులు ఇవ్వడం కుదరదనడం, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తుండటం, తిరుపతి – గన్నవరం – రాజమండ్రి విమానాశ్రయాలను అమ్మకానికి పెట్టేయడం.. ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డికి కనబడకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.
ఈస్థాయిలో ఏపీకి మోడీ అన్యాయం చేస్తుంటే… రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుంటే… మరిముఖ్యంగా విభజన చట్టంలోని హామీలను కూడా అమలుచేయకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే… కిరణ్ కి మాత్రం అవన్నీ బ్రహ్మాండమైన సహకారంలా కనిపించడాన్ని ఏమనుకోవాలి? కళ్లకు కమళం పొరలు కమ్ముకున్నాయని భావించాలా.. లేక, బీజేపీ బ్రతికి బట్టకట్టాలంటే ఏపీకి అన్యాయం చేస్తున్నా కూడా దాన్ని అభివృద్ధిగా చెప్పాలనే తాపత్రయంగా అనుకోవాలా.. నల్లారివారే సెలవివ్వాలి!