విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఉదంతం విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం ముగిసి నెల రోజులు కూడా కాకముందే మరో కుటుంబం కిడ్నాప్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ కిడ్నాప్ వ్యవహారం కూడా సినీ ఫక్కీలో సాగడం గమనార్హం. అయితే ఈ కేసును కూడా పోలీసులు వాయువేగంతో చేధించినట్లు తెలుస్తుంది.
వివారాళ్లోకి వెళ్తే. శ్రీనివాస్ అనే విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అందులో భాగంగా వీరిద్దరిని బలవంతంగా విజయవాడకు తరలించాలని ఫిక్సయ్యారు. ఈ సమయంలో మార్గమధ్యంలోనే రియల్టర్ భార్య లక్ష్మిను దించేశారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఇలా మరోసారి కిడ్నాప్ సమాచారం రావడంతో అలర్ట్ అయిన పోలీసులు శ్రీనివాస్ భార్య లక్ష్మి తెలిపిన సమాచారం మేరకు రంగంలోకి దిగారు. కిడ్నాపర్లను అన్నవరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా… శ్రీనివాస్ దంపతులను కిడ్నాప్ చేయడానికి గల కారణాలను తెలుసుకునే నేపథ్యంలో విస్తుపోయే నిజాలు తెలిశాయని తెలుస్తుంది.
శ్రీనివాస్ అంతకముందు విజయవాడలో ఎంతో మంది నుంచి డబ్బులు తీసుకుని విశాఖకు మకాం మార్చాడని, ఇంకా 2021 అతనిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై జైలుకు కూడా వెళ్లాడని తెలిసింది. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత విశాఖలోని మరో రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్ గా శ్రీనివాస్ చేరాడని పోలీసులు తెలుసుకున్నారని సమాచారం.
కాగా, శ్రీనివాస్‌పై రూ.3 కోట్ల రూపాయలు కాజేసినట్లుగా ఆరోపణలు ఉండగా.. అందులో రూ. 60 లక్షలు తమకు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.