ఇకపై, రాజకీయ నాయకుల్ని వారి పేర్లతో పిలవకండి.! హోదాతోనూ పిలవాల్సిన పనిలేదు.! ఆయా రాజకీయ నాయకులు అరెస్టయి, జైలుకెళతారు కదా.. అప్పుడు, వాళ్ళకి ఇచ్చే ‘ఖైదీ నెంబర్’ని పేర్కొంటూ, అదే పేరుతో ప్రస్తావించండి.!
ఓ వైసీపీ నేత, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో.. మోడరేటర్‌గా వ్యవహరించిన జర్నలిస్టుకి చేసిన సలహాతో కూడిన సూచన ఇది. ఆ వైసీపీ నేత పేరు కొండా రాజీవ్ గాంధీ.! ఇలాంటి ‘కొండ’ ఆలోచనలు ఎలా వస్తాయ్.? బహుశా అదే వైసీపీ ప్రత్యేకత కావొచ్చు.!
విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత.. అంటూ చంద్రబాబుని సదరు జర్నలిస్టు ప్రస్తావించారు. అలా పేర్కొనడం వైసీపీ నేతకు ఎక్కడో కాలేలా చేసింది. ఇందులో ఏది తప్పు.? ఏదీ తప్పు కాదు కదా.!
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వున్నారు.! రాజకీయ నాయకులు, రాజకీయంగా ఎన్నయినా విమర్శలు చేసుకోవచ్చు. మీడియా అలా వుండదు కదా.! జర్నలిస్టులు అలా వ్యవహరించరు కదా.! ‘ఖైదీ నెంబర్ 7691’ అని ప్రతిపక్ష నేతని ఎలా పిలుస్తారు.?
గతంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఖైదీ నెంబర్ 6093’గా వున్నారు. ఒకరోజు కాదు, ఒక నెల కాదు.. దాదాపు ఏడాదిన్నర.! సో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని పిలవకుండా, మీడియా ఆయన్ని ‘ఖైదీ నెంబర్ 6093’ అని పిలిస్తే ఎలా వుంటుంది.? అత్యంత అసహస్యంగా, అసభ్యకరంగా వుంటుంది.
సదరు వైసీపీ నేతకి చంద్రబాబు మీద మంట కంటే, సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అసహస్యం ఎక్కువ వున్నట్లుంది. లేకపోతే, చంద్రబాబుని ఖైదీ నెంబర్ 7691 అని పిలవమంటాడేంటి.? అది కూడా జర్నలిస్టులు అలాగే ప్రస్తావించాలని కోరతాడేంటి.? అదే అందరు జర్నలిస్టులూ సీరియస్‌గా తీసుకుంటే, వైఎస్ జగన్ పేరు కాకుండా పదే పదే ‘ఖైదీ నెంబర్ 6093’ అని ప్రస్తావించాల్సి వస్తుంది కదా.?