నగిరి ఎంఎల్ఏ ఆర్కె రోజాను జగన్మోహన్ రెడ్డి కీలక పదవిలో నియమించారు. రోజాను ఏపిఐఐసి ఛైర్మన్ గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్మన్ గా నియమించబోతన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నా ఉత్తర్వులు మాత్రం బుధవారం రాత్రే జారీ అయ్యాయి.
మంత్రివర్గంలో రోజా ఎంతో ఆశపెట్టుకున్నారు. అలాంటిది జగన్ మంత్రివర్గంలో తనకు స్ధానం లేకపోవటంతో నిరాస చెందిన మాట వాస్తవమే. దాంతో జగన్ ప్రత్యేకంగా రోజాను పిలిపించుకుని మాట్లాడారు. క్యాబినెట్ లో చోటు లేకపోయినా క్యాబినెట్ ర్యాంకున్న పోస్టును ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. దానికి తోడు ఏపిఐఐసి ఛైర్మన్ అంటేనే దాదాపు పరిశ్రమల శాఖ మంత్రి స్ధాయి లాంటిదే.
ఎందుకంటే పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఏపిఐఐసిదే కీలక పాత్ర. పైగ ఛైర్మన్ నియామకాన్ని కూడా రోజాకు రెండేళ్ళ పాటే ఇచ్చారు. అంటే వచ్చే మంత్రివర్గానికి రెండేళ్ళు నిండేనాటికి రోజా ఛైర్మన్ పదవి కూడా దాదాపు అయిపోతుంది. ఇప్పటి మంత్రివర్గాన్ని రెండేళ్ళ తర్వాత మార్చేస్తానని జగన్ గతంలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అంటే జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే రెండేళ్ళ తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజాకు చోటు కల్పించటం ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎలాగూ వచ్చే ఎన్నికల నాటికి రోజా లాంటి మంచి వాగ్ధాటి ఉన్న నేతలు మంత్రివర్గంలో ఉంటే జగన్ కే మంచిది. మొత్తానికి రోజాకు పదవి విషయంలో జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నట్లే.